జల్సాలకు అలవాటుపడి చోరీలు | - | Sakshi
Sakshi News home page

జల్సాలకు అలవాటుపడి చోరీలు

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్‌): జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా మార్టూరు పరిసరాల్లో ద్విచక్రవాహనాలను దొంగిలించి సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడుకు తరలించి ఇక్కడ వాటిని విక్రయిస్తున్నారు. చోరీల ముఠా సభ్యుడైన షేక్‌ మస్తాన్‌ మార్టూరులో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మిగిలిన సభ్యులతో దొంగిలించిన వాహనాలను గుమ్మళంపాడులోని షేక్‌ బాజీ దగ్గరికి చేర్చి కొన్ని రోజుల తరువాత వాహనాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మార్టూరు పరిసర ప్రాంతాల్లో చోరీ చేసిన ద్విచక్రవాహనాన్ని సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడుకు చెందిన షేక్‌ బాజీకి ఇచ్చేందుకు వస్తున్నారని సమాచారం అందింది. దీంతో సీసీ కెమెరాల సాయంతో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్యంగా పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించి పక్కా సమాచారంతో ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్‌ బాలుడు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు షేక్‌ మస్తాన్‌పై గతంలో మార్టూరులో పలు కేసులు ఉన్నాయని. పాత నేరస్తుడు కావడంతో దొంగతనాలు చాకచక్యంగా చేసేవాడు. చోరీ ముఠాను పట్టుకున్న సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్‌బాబు, ఏఎస్సై మాలకొండయ్య హెడ్‌ కానిస్టేబుల్‌ ఉదయ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు పవన్‌, జాన్‌వెస్లీ, నారాయణరెడ్డి, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మార్టూరు పరిసరాల్లో దొంగిలించి గుమ్మళంపాడులో విక్రయాలు

నిందితుల నుంచి

8 ద్విచక్రవాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

సీఐ శేషగిరిరావు

Advertisement
 
Advertisement
Advertisement