కొత్తపట్నం: అంత్యక్రియల విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కిల్లేటి జాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం కుటుంబ సభ్యులు మృతి చెందిన వ్యక్తిని అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో మరో సామాజిక వర్గం వారు మీకు ఇక్కడ శ్మశాన స్థలం లేదు.. కావున ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ డీ రామానాయుడు, ఎస్సై వేముల సుధాకర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వారితో మాట్లాడి ఒప్పించారు. చివరికి ఒక సామాజిక వర్గం వారు శ్మశాన స్థలాన్ని కేటాయించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో పలువురు నాయుకులు, గ్రామస్తులు వారిని అభినందించారు. అనంతరం మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు.


