పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి జాగ్రత్తలతో మలేరియా నివారణ సాధ్యం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా అక్రమ కుళాయిలపై చర్యలు

ఒంగోలు టౌన్‌: ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల (పీటీసీ)లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. గుంటూరు రేంజ్‌ నుంచి శ్రీనివాసులు రెడ్డికి పదోన్నతి లభించింది. మంగళగిరి హెడ్‌ క్వార్టర్స్‌లో వెంటనే రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రతలు తీసుకోవడం ద్వారా మలేరియాను నిర్మూలించవచ్చని కలెక్టర్‌ పీ రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రజా దర్బార్‌ హాలులో ఈనెల 30వ తేదీ వరకు జరిగే మలేరియా వ్యతిరేక మాసోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దోమకాటు వలన మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయని వివరించారు. దోమలు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని చెప్పారు. నీటి ట్యాంకులు, డ్రమ్‌లు, బకెట్లను కప్పిపెట్టాలని, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పగిలిన పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి ఎన్‌.మధుసూదన్‌ రావు, సబ్‌ యూనిట్‌ ఆఫిసర్లు పాతూరి శ్రీనివాసులు, సాగర్‌, అర్జునరావు, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

గుడ్లూరు: భూములిచ్చిన రైతులకు, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని గ్రామస్తులు ఇండోసోల్‌ కంపెనీ ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రావూరు, చేవూరు, ఏలూరుపాడు, సాలిపేట గ్రామ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు భూములన్నీ స్వాధీనం చేసుకున్న తరువాత రాజమండ్రి, ఇతర పరిసరాల ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుక్నున కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంత సేపు కంపెనీ నిర్వాహకులు, స్థానిక రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి చేవూరు గ్రామానికి వచ్చే రోడ్డు దుమ్ము లేని ఇబ్బందులు పడుతున్నామని, తారురోడ్డు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లడుతూ స్థానికులకు ఉద్యోగాలు, రోడ్డు సమస్య విషయాలను కంపెనీ వారితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బాలకిషోర్‌, గుడ్లూరు సీఐ నరేష్‌కుమార్‌, ఎస్సై వెంకట్రావు ఉన్నారు.

కందుకూరు: అనుమతి లేకుండా వాడుకుంటున్న అక్రమ నీటి కుళాయిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ కె.అనూష సోమవారం తెలిపారు. అక్రమ కుళాయిలను గుర్తించేందుకు సోమవారం కల్లూరి ప్రశాంతినగర్‌లో ఇంటింటి తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో ఒక అక్రమ కుళాయిని గుర్తించి వెంటనే తొలగించామన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున పట్టణంలో ఎవరైనా అక్రమంగా నీటి కుళాయిలు బిగించి ఉంటే వెంటనే వార్డు అమినిటీష్‌ సెక్రటరీ సంప్రదించి రెగ్యులర్‌ చేసుకోవాలని సూచించారు. లేదంటూ తనిఖీల్లో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement