ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులపై అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేజీబీవీ ఎస్టీయూ ఏపీ ప్రెసిడెంట్ రత్నమాలిని దేవి ఆరోపించారు. సోమవారం కేజీబీవీ సిబ్బంది సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మల్లయ్య లింగం భవనంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నామని, కేవలం రూ.4 వేల నుంచి రూ.25 వేల వరకు కట్టు బానిసల్లా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నామని చెప్పారు. ఇటీవల ట్రాన్స్‌ఫర్‌ల పేరుతో సిబ్బందిని వేధిస్తున్నారని, బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఏమాత్రం పట్టించుకోకుండా వాట్సాప్ సందేశాల ద్వారా బదిలీలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. తనకు నచ్చిన వారికి నచ్చిన కేజీబీవీలో బదిలీ చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. ప్రస్తుతం నాలుగు ప్లేసుల్లో స్టేటస్ కో ఉన్న ఆ ఆర్డర్‌ను బాహాటంగానే ధిక్కరిస్తూ లిఖిత పూర్వకంగా జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల సరస్వతి షిండే మాలతి, రత్నకుమారి, మాధురి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.


