ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 256 అర్జీదారులు వచ్చి తమ అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ ప్రజల సంతృప్తే లక్ష్యంగా నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే, దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యేలా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. అధికారి తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు మళ్లీ రీ ఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పీజీఆర్‌ఎస్ వినతులను ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొని అధికారులు వినతులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


