● ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఒంగోలు టౌన్: పోలీసు శాఖపై ప్రజలకు మరింతగా విశ్వాసం పెరిగేలా పోలీసు అధికారులు స్పందించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును కూలంకషంగా పరిశీలించి చట్టపరిధిలో విచారించి తగిన పరిష్కారం చేయాలని సూచించారు. పిర్యాదుల పరిష్కారం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, అద్దంకి సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వకేట్ బీ బాలాజీ సింగ్, వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.


