వెంకటసాయి.. మీ సంకల్పానికి సెల్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

వెంకటసాయి.. మీ సంకల్పానికి సెల్యూట్‌

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● వైకల్యాన్ని జయించిన ఇద్దరు ● ‘డిజిటల్‌’లో రాణిస్తున్న యువకుడు ● ‘పది’లో సత్తా చాటిన బాలుడు ● యువతకు ఆదర్శంగా ఈ దివ్యాంగులు

వైకల్యం శరీరానికే గాని మేధస్సుకు కాదని నిరూపిస్తున్నారు వీరు. పుట్టుకతోనే తోడైన ఎముకల వ్యాధి మంచానికే పరిమితం చేసినా డిజిటల్‌ రంగంలో పట్టు సాధించి టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు ఓ యువకుడు. గాలిపటం ఎగరేస్తూ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా పట్టుదలతో ‘పది’ పరీక్షలు రాసి సత్తా చాటాడు మరో బాలుడు. దైవ నామాలతో సంకల్పదీక్షను జయించిన ఆ ఇద్దరిలో ఒకరు వెంకటరమణ కాగా మరొకరు శ్రీసాయిచరణ్‌. అన్నీ ఉండి నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువత ఒక్కసారి ఆలోచించాల్సిందే. విధిని కూడా జయించిన వీరికి సెల్యూట్‌ చేయాల్సిందే. – ఆదిలాబాద్‌టౌన్‌

రెండు చేతులు కోల్పోయినా

అధైర్యపడకుండా..

ఆదిలాబాద్‌ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన పొచ్చన్న–రమ దంపతులకు ఇద్ద రు సంతానం. ఆరేళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున వీరి కుమారుడు శ్రీసాయిచరణ్‌ గాలిపటం ఎగురవేసేందుకు పక్కింటికి వెళ్లాడు. బంగ్లాపై ఎ గురవేసే క్రమంలో ఇంటి పైనుంచి వెళ్తున్న 33కే వీ విద్యుత్‌ తీగలకు తగిలి షాక్‌కు గురయ్యాడు. రెండు చేతులతో పాటు రెండు కాళ్లకు సంబంధించి రెండ్రెండు వేళ్లను కోల్పోయాడు. విధి వక్రించినా అధైర్యపడలేదు. చదవాలనే తపనతో మోచేతులతో పెన్ను పట్టడం, రాయడం నేర్చుకున్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలకు హాజరై 500కు గాను 417మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. అయితే, ఈ బాలుడు కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం సొంతగా చేసుకోలే డు. తల్లిదండ్రులే అన్నీ చూసుకుంటున్నారు. ప్ర స్తుతం ఇంటర్‌ ఎంపీసీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. తల్లి గృహిణి కాగా, తండ్రి డ్రైవర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించడానికి తండ్రి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లగా రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా దిక్కుతోచని స్థితి లో ఆపన్నహస్తం కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది. ప దో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఇటీవల కలెక్టర్‌ రాజర్షిషా ఈ బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు.

మంచానికే పరిమితమైనా..

డిజిటల్‌ రంగంలో రాణిస్తూ..

ఆదిలాబాద్‌ పట్టణంలోని కై లాస్‌నగర్‌కు చెందిన టెంబేకర్‌ సంతోష్‌కుమార్‌–సురేఖ దంపతులు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. పెద్ద కుమారుడైన వెంకటరమణను పుట్టుకతోనే ఎముకల జన్యు సంబంధ సమస్య వెంటాడింది. ప్రస్తుతం ఈయన వయస్సు 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. సెల్‌ఫోన్‌, టీవీ చూస్తూ ఇంగ్ల్లిష్‌ భాషపై పట్టు సాధించాడు. కుమారుడి పట్టుదల, తెలివితేటలు చూసి చదువు నేర్పించేందుకు ఓ ట్యూటర్‌ను ఏర్పాటు చేశారు పేరెంట్స్‌. 2018లో ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి పరీక్ష రాసి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పుడు ఈ బాలుడి అమ్మమ్మ ప్రభావతి చార్టుల ద్వారా అక్షరాలు నేర్పించింది. తల్లి అప్పుడప్పుడు బడికి తీసుకెళ్లేది. వెనుక బెంచిలో పడుకోబెట్టినప్పుడు పాఠాలు విని అర్థం చేసుకునేవాడు. ఆంగ్లం ధారళంగా మాట్లాడేవాడు. 2024లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ డిజిటల్‌ మార్ట్‌లో ఆన్‌లైన్‌లో కోర్సు నేర్చుకున్నాడు. ఎనిమిది నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్‌ అందుకున్నాడు. నాలుగు నెలల పాటు ఆన్‌లైన్‌లోనే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాడు. ఈయన తెలివితేటలు చూసి ఆ సంస్థ మొదట రూ.18వేల వేతనం చెల్లించింది. ఆ తర్వాత టీమ్‌ లీడర్‌గా నియమించింది. ప్రస్తుత ం రూ.35వేల నుంచి రూ.40వేల వరకు వేతనం పొందుతున్నాడు. చాలా మంది కాలక్షేపం కోసం వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్‌ను ఈయన ఆయుధంగా మలుచుకున్నాడు. రెండు చేతుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఆ చేతితో మొబైల్‌ ఆపరేట్‌ చేస్తూ డిజిటల్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఎముకల వ్యాధి కారణంగా అతడిని కదిపితే ఎముకలు విరిగిపోతాయి. దీంతో ఎటువెళ్లినా ఓ పీటపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు బడికి వెళ్లే ముందు తినిపించి వెళ్తారు. మధ్యాహ్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి తినిపిస్తారు. కాలకృత్యాలు తీర్చుతారు. ఈయన ముందు వైకల్యం కూడా ఓడిపోయింది. ఎంతో మంది సకలాంగులకు ఈయన జీవితం ఆదర్శనీయం.

Advertisement
 
Advertisement
Advertisement