నేడు ప్రవేశపెట్టనున్న నూతన కౌన్సిల్ ఆదాయం పెంపుపై దృష్టి సారిస్తారా.. పట్టణవాసుల ఎదురుచూపు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన 2026–27 బడ్జెట్‌ను మంగళవారం ఖరారు చేయనున్నారు. చైర్‌పర్స్‌న్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నూతన కౌన్సిల్ కొలువుదీరాక ప్రవేశపెడుతున్న తొలిబడ్జెట్ కావడంతో పట్టణ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పను లకు ఎలాంటి కేటాయింపులు చేయనున్నారనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ రూ.100 కోట్లపైనే ఆశలు..
మున్సిపల్ ఎన్నికలకు ముందు టీయూఎఫ్ ఐడీసీ ద్వారా రూ.18.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా నిధులతో చేపట్టే పనులకు అధికారులు ప్రతి పాదనలు సైతం సిద్ధం చేశారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జిమంత్రి సీతక్క భూమిపూజ కూడా చేశారు. అయితే ఆ పనులను ప్రారంభించకుండా అధికారులు మరోసారి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు మార్చారు. వాటికనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ నిధులను ప్రాధాన్యత ప్రకారం కేటా యిస్తారా, లేక మరోసారి ప్రతిపాదనలు రూపొందిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇక చైర్‌పర్సన్ అనూష బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావును హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కలిశారు. పట్టణాభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞ ప్తి చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆ దిశగా ప్రతి పాదనలు సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ రాజర్షి షాను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిధులు విడుదలైతే పట్టణ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి దోహదపడనుంది.
లోపిస్తున్న సమతూకం ..
ఈ మున్సిపాలిటీ గ్రేడ్–1 స్థాయికి ఎదిగినా అభివృద్ధిపరంగా వెనకబడి ఉందనే అభిప్రా యం వ్యక్తమవుతుంది.పట్టణంలోని విలీ న కాలనీల్లో ఇప్పటికీ తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి మౌలిక వసతుల్లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప ట్టణ ఆదాయ, వ్యయాల్లో ఉన్న వ్యత్యాసమే కారణంగా తెలుస్తోంది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు అందని పరిస్థితి. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి వచ్చే నిధులు కూడా ఆశించినంతగా ఉండడం లేదు. దీంతో నూతన అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. బల్దియాకు జనరల్ ఫండ్ ద్వారా సమకూరే ఆదాయంలో సింహభాగం మున్సిపల్ కార్మికుల వేతన చెల్లింపులకే పోతుంది. మిగిలిని కొద్ది పాటి నిధులను అత్యవసరమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులకు వినియోగిస్తున్నారు. ఇలా ఆదా య, వ్యయాల మధ్య సమతూకం లేకపోవడంతో బల్దియా సమస్యలు పరిష్కారానికి నోచుకోక అభివృద్ధికి అటంకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పట్టణంలో ప్రస్తుతం రూ.1.5 కోట్ల ట్రేడ్ లైసెన్స్ నిధులు పెండింగ్‌లో ఉండటం అధి కారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇకఆస్తిపన్ను, వీఎల్‌టీలను పూర్తిగా వసూలు చేయడం లేదని, ప్రచార హోర్డింగ్‌లతో వచ్చే ఆదా యం సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.
చర్చిస్తారా .. లడాయికి దిగుతారా
నేటి బడ్జెట్ సమావేశం సాఫీగా సాగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. గత నెలలో నిర్వహించిన కౌన్సిల్ తొలి సమావేశంలోనే అధికార, ప్రతి పక్ష కౌన్సిల్ సభ్యులు ఆరోప, ప్రత్యారోపణలతో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలోనైనా సభ్యులు రాజకీయాలు చేస్తూ లడాయికి దిగుతారా లేక ప్రజలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సూచనలు, సలహాలు చేస్తారా వేచి చూడాల్సిందే.


