రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి

Mar 27 2026 8:45 AM | Updated on Mar 27 2026 8:45 AM

● బస్సు ప్రమాదంలో ఒకరు మృతి ● కోమాలో మరొకరు.. ● స్వల్ప గాయాలతో బయట పడిన రోహన్‌

గుడిహత్నూర్‌: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన సాద్వి కుమారి అశ్విని కాగ్నే (19) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరాఠీ వార్‌కరీ సంప్రదాయానికి చెందిన అశ్విని కాగ్నే మహారాష్ట్రలోని ఖందార్‌ తాలుకా కల్లారీ గ్రామంలో నిర్వహిస్తున్న సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం పెదనాన్న వసంత్‌ కాగ్నే, తల్లి అయోధ్యాబాయితో కలిసి ఆటోలో బయలు దేరారు. సీతాగోంది సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో అశ్విని, వసంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించగా అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

చోరీ కేసులో ఆరునెలల జైలు

జైనథ్‌: చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు ఎస్సై పవర్‌ గౌతమ్‌ తెలిపారు. మండలంలోని దీపాయిగూడలో గతేడాది అక్టోబర్‌ 11న దురల రాజలింగు ఇంట్లో చోరీకి పాల్పడిన మడావి సోనేరావును గురువారం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి ఆరు నెలల జైలు, రూ.100 జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

బుగ్గిపాలైన వలస బతుకులు

లక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్‌ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంటికి వెళ్లే క్రమంలో....

బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్‌ ముగ్గురూ కలిసి ఆర్మూర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్‌ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్‌ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement