క్రీడాశాఖకు కాంట్రాక్టర్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడాశాఖకు కాంట్రాక్టర్‌ షాక్‌

Mar 27 2026 8:45 AM | Updated on Mar 27 2026 8:45 AM

స్విమ్మింగ్‌ పూల్‌ అద్దె చెల్లింపులో తాత్సారం లీజు రుసుము చెల్లింపునకు వెనుకడుగు రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు

ఆదిలాబాద్‌: జిల్లా క్రీడా శాఖను (డీఎస్‌ఏ) నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు అందుతుండడంతో స్థానిక వనరుల ద్వా రా నిధులు సమీకరిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం కోసం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పరిధిలో ఉన్న షాపులను, స్విమ్మింగ్‌ పూల్‌ను టెండర్ల ద్వా రా లీజుకు ఇస్తున్నారు. గతేడాది మార్చి లో ఓ కాంట్రాక్టర్‌ రూ.21 లక్షలకు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్నాడు. కానీ సకాలంలో రుసుము చెల్లించకపోవడంతో క్రీడాశాఖ ఆదాయానికి గండిపడుతోంది.

3 నెలలుగా నిలిచిన చెల్లింపులు..

గతేడాది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్‌కు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం ప్రకారం ప్రతీనెల లీజు రుసుమును జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఖాతాలో జమ చేయాలి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం.

పర్యవేక్షణ లోపంపై విమర్శలు

స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణను లీజుకు ఇచ్చినప్పటి నుండి ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నా సదరు కాంట్రాక్టర్‌కు కనీసం నోటీసులు కూ డా ఇవ్వకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని బయటకు రానీ యకుండా అధికారులు మౌనం వహించడంపై క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా లీజు ధరను రూ.16.60 లక్షల వరకు తగ్గించాలని సదరు కాంట్రాక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఉన్నతాధికారులు వివరాలను కోరగా, రెండవ లీజు దారుడు ఎంతవరకు కోట్‌ చేశారనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జిల్లా క్రీడాశాఖ అధికారులు నివేదికను సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పెంపు..

నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌ 12 సంవత్సరాల లోపు చిన్నారులకు అడ్మిషన్‌ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.500 తీసుకోవాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి అడ్మిషన్‌ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.1000 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్‌ 10 ఏళ్లలోపు వారికి నెలవారీ ఫీజు రూ.1000, ఆపై వారికి రూ.1500, స్పెషల్‌ బ్యాచ్‌ పేరిట రూ.2వేల నెలవారీ ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రికవరీ చేస్తారా?.. తగ్గిస్తారా?

బకాయి మొత్తాన్ని కాంట్రాక్టర్‌ నుంచి అధికారులు రికవరీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్‌ పెట్టుకున్న అర్జీని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం లీజు మొత్తాన్ని తగ్గిస్తుందా? లేక పాత ఒప్పందం ప్రకారమే వసూలు చేస్తుందా అనేది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే లీజు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే అవకాశాలు లేకపోలేదు.

మూడు నెలల బకాయిలను పరిశీలిస్తే రూ.5.25 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతీనెల 15లోగా లీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే రోజుకు రూ.2,500 పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 15 నుంచి 30 వరకు మూడు నెలల్లో 45 రోజులకు లెక్కించినా, పెనాల్టీ మొత్తంగా రూ.1,12,500 అవుతుంది. లీజు రుసుము పెనాల్టీ మొత్తాన్ని కలిపితే సుమారుగా రూ.6,37,500

అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement