ఆదిలాబాద్‌టౌన్: రోడ్లపై బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. అరైవ్ అలైవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు బుధవారం ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, డ్రైవర్ సీటు పక్కన ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అలాగే పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దన్నారు. అనంతరం సుమారు 100 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు బి.సునీల్ కుమార్, కె. నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


