చెల్లించండి ప్లీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

చెల్లించండి ప్లీజ్‌..

Mar 23 2026 9:13 AM | Updated on Mar 23 2026 9:13 AM

ఆస్తిపన్ను వసూళ్లకు సిబ్బంది పరుగులు

మొండి బకాయిల వసూళ్లకు చర్యలు

రేపటి వరకూ గడువు

రంపచోడవరం: పంచాయతీల్లో కొండలా పేరుకుపోతున్న పన్ను బకాయిల వసూలుకు ప్రభుత్వం గడువు విధించింది. వెంటనే పన్నులు వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో, సచివాలయ సిబ్బంది పన్ను వసూళ్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఈ నెల 24వ తేదీలోగా బకాయిలు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని నిర్ణయించారు.

బకాయిలు ఇలా..

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇంటి పన్ను బకాయిలు కూడా వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో మొత్తం 186 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 29,901 మందికి సంబంధించి రూ.3.33 కోట్ల మేర ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉంది. కాగా, ఇందులో ఇప్పటికే రూ.2.04 కోట్ల మేర ప్రజలు చెల్లించారు. మరో 7,064 మందికి సంబంధించి రూ.1.29 కోట్లు ఇంకా వసూలు కావాల్సి ఉంది. జిల్లా కేంద్రమైన రంపచోడవరం పంచాయతీ కార్యాలయానికి రూ.60.93 లక్షల మేర పన్ను బకాయి చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు మొత్తం రూ.45.13 లక్షలుండగా, ఇందులో రూ.8.50 లక్షల మేర మాత్రమే చెల్లింపులు జరిగాయి. రంపచోడవరం పంచాయతీ మినహా మిగిలిన అన్ని పంచాయతీలు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల్లోపు మాత్రమే పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పన్ను బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో అవి ఏళ్ల తరబడి కొండలా పేరుకుపోతున్నాయి. రంపచోడవరంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు సంబంధించి ఐటీడీఏ భవనం, ప్రభుత్వ క్వార్టర్లకు పన్ను చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివలన పంచాయతీలో గ్రామాల అభివృద్ధికి పరోక్షంగా విఘాతం కలుగుతోంది.

రిసార్ట్స్‌పై పన్నులు స్వల్పమే..

జిల్లాలో పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేసిన రిసార్ట్స్‌ నుంచి పంచాయతీలకు ఆదాయం రావడం లేదు. రిసార్ట్స్‌, గెస్ట్‌హౌస్‌లకు పూర్తి స్థాయిలో లెక్కలు కట్టి పన్నులు విధించాల్సి ఉండగా.. అరకొరగా లెక్కలు వేసి తోచిన విధంగా చాలా తక్కువ మొత్తంలో పన్నులు విధించారు. ఫలితంగా పెద్ద పెద్ద రిసార్ట్స్‌ యజమానులు సైతం ఏడాదికి రూ.600 నుంచి రూ.1,000 వరకూ మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. జిల్లాలో సుమారు 500 వరకూ రిసార్ట్స్‌, గెస్ట్‌హౌస్‌లలో గదుల సౌకర్యం ఉంది. రిసార్ట్స్‌ నిర్వహకులు పర్యాటకుల నుంచి వసతి కోసం ఒక్కో రూముకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేస్తున్నారు. వారాంతాలు, సెలవులు, పండగ రోజుల్లో వీటి అద్దెలను మరింత పెంచుతున్నారు. కానీ, దీనికి తగిన రీతిలో పన్నులు విధించడం లేదు. ఫలితంగా పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. రంపచోడవరం, మారేడుమిల్లి, సున్నంపాడు పంచాయతీల పరిధిలో ఎన్ని రిసార్ట్స్‌ ఉన్నాయి, అద్దెలు ఎలా వసూలు చేస్తున్నారు, ఇందులో జీఎస్‌టీకి ఎంత వెళ్తుంది, పంచాయతీకి ఎంత చెల్లిస్తున్నారు వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.

పన్ను బకాయిలు ఇలా..

జిల్లాలో పంచాయతీలు 186

పన్ను వసూలు లక్ష్యం రూ.3.33 కోట్లు

చెల్లించాల్సిన వారు 29,901

వసూలైనది రూ.2.04 కోట్లు

బకాయి రూ.1.29 కోట్లు

దీనిని చెల్లించాల్సిన వారు 7,064

ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు

రూ.45.13 లక్షలు

వసూలు రూ.8.50 లక్షలు

పంచాయతీలకు ఆస్తిపన్ను బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ప్రస్తుతం ఈ పనిలో పంచాయతీ యంత్రాంగమంతా నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ హడావుడే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement