● దీనికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలి
● చంద్రబాబు కేసులన్నీ
రీ ఓపెన్ చేయిస్తాం
● జడ శ్రావణ్ కుమార్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళిత, బహుజనులపై దాడులు పెరిగిపోయాయని జైభీమ్‌రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దళితులపై అమానుష దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పి.గన్నవరం నియోజకవర్గంలో దళితుని మృతదేహాన్ని తన ఇంటి ముందు నుంచి తీసుకెళ్లకూడదంటూ ఓ వ్యక్తి దురహంకారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పి, ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ కల్యాణ్ అదే ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకూ ఎటువంటి కేసులూ నమోదు కావడం లేదని చెప్పారు.
అప్పుడే శిక్షించి ఉంటే..
పిఠాపురం మండలం మల్లాం సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి ఉంటే ఉప్పాడ కొత్తపల్లిలో మరో సంఘటన జరిగి ఉండేది కాదని శ్రావణ్ కుమార్ అన్నారు. ఇలా శిక్షలు పడనందువల్లనే దళితులపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. వీటన్నింటి వెనుక పవన్ కల్యాణ్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో హెడ్మాస్టర్, ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ ఎస్సీ పిల్లలను అనేక ఇబ్బందులకు గురి చేసినా.. ఆ పిల్లల తల్లిదండ్రులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకుండా సీఐ క్లీన్‌చిట్ రిపోర్టు ఇవ్వడాన్ని శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, సీఐ కాదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని ప్రజలకు ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు రాజీ పడితే తానేమీ చేయలేనని, నిలబడితే కేసును ఎంతవరకూ అయినా తీసుకువెళ్తానని చెప్పారు.
వారు కోర్టుకు రావాల్సి ఉంటుంది
జిల్లా కలెక్టర్ పిఠాపురం నియోజకవర్గానికి కలెక్టర్‌లా వ్యవహరిస్తున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. జిల్లాలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా కేసులు నమోదు కాకుండా చూస్తున్నారని, త్వరలో కలెక్టర్, ఎస్పీ కూడా హైకోర్టుకు రావాల్సి ఉంటుందని అన్నారు. దళితులపై దాడులు జరుగుతూంటే కండిషన్ బెయిల్ ఇప్పించే పాత్రను వీరు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు పని చేసే అధికారులకు తిప్పలు తప్పవని అన్నారు.
పవన్ మాటలు సిగ్గుచేటు
జిల్లాలో 20 మందికి పైగా అగ్ని ప్రమాదంలో చనిపోతే వారికి చెక్కులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఒక కుటుంబం పెద్ద వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు. రాష్ట్రంలో 67 శాతం పరిశ్రమలకు పొల్యూషన్‌కు సంబంధించి అనుమతుల్లేవని, వాటిని తీసుకుని ఫ్యాక్టరీలు నడపాలంటే ఉపాధి కల్పించలేమని అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పొల్యూషన్, ఫైర్ శాఖలకు చెరో రూ.10 లక్షలు లంచాలివ్వాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనితపై ఆరోపణలు చేసి రూ.10 కోట్లకు పైగా తన సంపదను పెంచుకున్నారని, కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోన్ చేసి కేసులు కట్టవద్దనే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో సంవత్సరం కాలం పాటు షూటింగ్‌లకు కేటాయించిన ఆయన రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ షూటింగ్‌లలో పాల్గొనే ఏకై క వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులన్నీ రీ ఓపెన్ చేయించే పనిని తమ పార్టీ తీసుకుంటుందని,, దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. గంటకు రూ.కోటి చెల్లించి వాదించే సుప్రీంకోర్టు లాయర్లను చంద్రబాబు తీసుకొస్తున్నారని, తనకు ఎవరైనా ఫర్వాలేదని, చేస్తున్న పాపాల నుంచి ఆయన తప్పించుకునే ప్రసక్తే లేదని అన్నారు. విజయవాడ వరకూ వచ్చి తనను కలవలేని వారెవరైనా సరే కాకినాడలోని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది జగ్గారపు మల్లికార్జునను కలవవచ్చని శ్రావణ్ కుమార్ చెప్పారు. పేదల పక్షాన పోరాడటమే తమ పార్టీ లక్ష్యమన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తమ అనుచరులను నియమిస్తామన్నారు. సమావేశంలో జగ్గారపు మల్లికార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిలపు హరీష్, జిల్లా ఉపాధ్యక్షుడు దడాల బాబ్జీ పాల్గొన్నారు.


