గంగవరం: పెద్ద పులి సంచారంతో సుమారు నెల రోజులుగా జిల్లాలోని అటవీ శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటు ప్రజలు కూడా ఆ పులి ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. ఏజెన్సీ నుంచి ఈ పులి గత నెలలో కాకినాడ జిల్లాకు మకాం మార్చి, మళ్లీ యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని దాటుకుని, గంగవరం మండలం వైపు పయనిస్తోంది. దీంతో, మండల ప్రజల్లో వణుకు పుడుతోంది. రేడియో ట్రాకింగ్ సిగ్నల్స్ సహకారంతో పులి ఎక్కడ సంచరిస్తోందో అటవీ అధికారులు గమనిస్తున్నారు. ఇటు సిబ్బందిని మరోవైపు ప్రజలను, రైతులను అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశువులపై దాడి చేస్తే నష్టపరిహారం అందిస్తున్నారు. పులి సంచారంపై అప్రమత్తంగా ఉన్నామని అడ్డతీగల్ సబ్ డీఎఫ్‌ఓ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నుంచి పులి గంగవరం మండలం రాముల్దేవుపురం, పిడతమామిడి, వేములోవ అటవీ ప్రాంతాల్లో సంచరించిందని చెప్పారు.
తొలిసారి ఫస్ట్ ర్యాంక్
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం 73.7 శాతం భక్తుల సంతృప్తితో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదివారం ఈ విషయం తెలిపారు. దేవస్థానాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం ప్రారంభించాక అన్నవరం ప్రథమ స్థానంలో రావడం ఇదే తొలిసారి. తాజా సర్వేలో 65.9 శాతంతో శ్రీశైలం ఏడో స్థానంలో నిలిచింది. 73.6 శాతంతో రెండో స్థానంలో నిలచిన ద్వారకా తిరుమల కన్నా అన్నవరం దేవస్థానం 0.1 శాతం మాత్రమే ఎక్కువ పొందింది. స్వామివారి దర్శనంపై 76.6 శాతం, మౌలిక వసతుల కల్పనపై 71.5 శాతం, ప్రసాదం నాణ్యతపై 79.9 శాతం, పారిశుధ్య ఏర్పాట్లపై 66.3 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివాహ బృందాలు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సాయంత్రం వరకూ విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.
వ్యవసాయ కూలీ నిజాయితీ
నిడదవోలు: కనిపించిన వస్తువును ఎవ్వరూ చూడకుండా సొంతం చేసుకుందామనుకునే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ, ఆ వ్యవసాయ కూలీ తాను ఈ చోరధోరణికి అతీతమని నిరూపించుకున్నాడు. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలివీ.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని బంధువుల ఇంట ఆదివారం జరిగిన వివాహ వేడుకకు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన చెందిన ఎన్.నాగేశ్వరరావు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మెడలోని సుమారు రూ.2.70 లక్షల విలువైన రెండున్నర కాసుల బంగారు గొలుసు పడిపోయింది. ఆ దారి వెంట నడిచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అరిగెల శేషారావు కంట ఆ గొలుసు పడింది. దానిని ఎవరు పోగొట్టుకున్నారో, వారికి ఎలా అందజేయాలో తెలియక ఆలోచనలో శేషరావు పడ్డారు. అంతలో తన చైన్ పడిపోయిందంటూ నాగేశ్వరరావు లబోదిబోమంటూ వీధుల్లో వెతుకుతున్నారు. విషయం తెలిసిన శేషారావు నిజాయితీతో ఆ బంగారు గొలుసును నాగేశ్వరరావుకు అప్పగించారు. శేషారావు నిజాయితీని అందరూ అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.


