ఊరంతా కదలివచ్చి..
రోడ్డు నిర్మించాలని జేసీకి వినతి
అడ్డతీగల – ఏలేశ్వరం మధ్య 11 కిలోమీటర్ల మేర గోతులమయంగా మారిన రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా జేసీ అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేసినట్లు సీపీఎం పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పిన కిరణ్ తెలిపారు. అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, ఏలేశ్వరం మండలాల్లోని 345 గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు అత్యంత ఆధారమన్నారు. ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు రోడ్డును పునర్నిర్మించాలని కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని జేసీ హామీ ఇచ్చినట్లు కిరణ్ తెలిపారు.
ఫ రోడ్డు కోసం ఉద్యమ బాట
ఫ గొంటువానిపాలెంలో రెండో రోజూ
కొనసాగిన నిరసన
ఫ పెద్దఎత్తున తరలివచ్చిన మన్యం ప్రజలు
అడ్డతీగల: ఊరూవాడా కదలివచ్చారు.. రోడ్డు కోసం ఉద్యమ బాట పట్టారు.. మా బతుకులు మార్చాలంటూ నినదించారు.. సమస్య తీర్చేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.. అడ్డతీగల – ఏలేశ్వరం మధ్‌య్ అధ్వానంగా ఉన్న 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని కోరుతూ గురువారం గొంటువానిపాలెం శివారున మొదలైన నిరవధిక నిరసన రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. చీకటి పడినా గురువారం రాత్రంతా నడిరోడ్డుపైనే టార్ఫాలిన్లు వేసుకుని ఆందోళనకారులు నిద్రించారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, వై.రామవరం మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. గొంటువానిపాలెం రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలంటూ ఉద్యమాన్ని కొనసాగించారు.
భోజనం నిలిపివేయించి..
ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతున్న తమకు వస్తున్న ఆహార పదార్థాలను పోలీసులు నిలుపుదల చేయించడం తగదని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా తమ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు ఏలేశ్వరం వైపు, ఇటు అడ్డతీగల వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే జడ్డంగి అన్నవరం వద్ద ప్రధాన రోడ్డుపైకి ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మించాలంటూ ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు.
లిఖిత పూర్వక హామీతో..
ఫిబ్రవరి మొదటి వారం నుంచి అడ్డతీగల – ఏలేశ్వరం మధ్య పాడైన 11 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ కేఎస్ రామారావు ఆందోళనకారులకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నిరసనకారులతో చర్చించారు. ఎన్డీబీ (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్) నిధులతో ఈ రోడ్డు పనులు నిర్వహించాల్సి ఉందని వివరించారు. నిధులు విడుదల కాక రోడ్డు పనులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నెలాఖరు నాటికి కాంట్రాక్టర్‌కు రావాల్సిన బకాయిలు క్లియర్ చేసి వెంటనే పనులు ప్రారంభింపజేస్తామని రామారావు అన్నారు. వచ్చే నెల 10 లోగా పనులు ప్రారంభించకపోతే, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆందోళనను ఉద్యమకారులు విరమించారు.
ఊరంతా కదలివచ్చి..
ఊరంతా కదలివచ్చి..


