ఆశ్రమ పాఠశాలకు పూర్వ వైభవం తెస్తాం
ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి
రాజవొమ్మంగి: తాళ్లపాలెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తాళ్లపాలెంలో చిట్టడవిని తలపిస్తున్న ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏడేళ్ల కిందట ఈ పాఠశాలను ఏకలవ్య పాఠశాలగా మార్పు చేసి, దానిని రాజవొమ్మంగికి తరలించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల భవనాలు నిరుపయోగంగా మారి శిథిలస్థితికి చేరుకుంటున్నాయని, పాఠశాల ప్రాంగణంలో మొక్కలు మొలచి అడవిని తలపిస్తోందని బొజ్జిరెడ్డికి స్థానికులు వివరించారు. తరగతి గదులు, టాయిలెట్స్, క్రీడా ప్రాంగణం వంటి సదుపాయాలను పరిశీలించిన ఆయన ఇంత చక్కని సదుపాయాలు ఉన్న ఈ పాఠశాలను ఎందుకు మూసివేశారో తెలుసుకుని, పునః ప్రారంభించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో తాత్కాలికంగా నడుస్తున్న జీసీఎస్ (ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల) చిన్నారులతో చైర్మన్ ముచ్చటించారు. లాగరాయిలో వసతి గృహం తిరిగి ఏర్పాటు చేయాలని, కిండ్ర పాఠశాలకు అదనపు తరగతి భవనాలు నిర్మించాలని స్థానికులు కోరారు. లాగరాయి, రాజవొమ్మంగి పీహెచ్‌సీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కిండ్ర సచివాలయంలో సిబ్బంది పని తీరుపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ, సూరిబాబు, నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు రాజుబాబు పాల్గొన్నారు.


