సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం | - | Sakshi
Sakshi News home page

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం

Jan 24 2026 8:47 AM | Updated on Jan 24 2026 8:47 AM

సర్పవ

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం

మాఘ ఉత్సవాలకు ముస్తాబు

భావనారాయణ స్వామి ఆలయంలో

పూర్తయిన ఏర్పాట్లు

రేపటి నుంచి ఆదివారం తిరునాళ్లు

వేలాదిగా రానున్న భక్తులు

కాకినాడ రూరల్‌: జిల్లాలో పురాతన ప్రసిద్ధి చెందిన సర్పవరంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం మాఘ ఉత్సవాలకు ముస్తాబైంది. కాకినాడ సమీపాన ఉన్న సర్పవరం గ్రామంలో సాక్షాత్తూ ఆ వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువే భావనారాయణ స్వామిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో పురాతన కాలం నాటి రాతి కట్టడాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని పురావస్తు శాఖ పర్యవేక్షిస్తుంది. ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న అత్యంత ఎత్తయిన రాజగోపురం, నారద గుండం సరస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ క్షేత్రంలోని భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్వామిని ఆరోగ్య ప్రదాతగా స్వామిని భావించి, మాఘ మాసంలో వచ్చే ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడకు వస్తూంటారు. ఆలయంలో ఇప్పటికే మాఘ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక సంబరాలకు ఈ క్షేత్రం ముస్తాబైంది. ఈ మాఘ మాసంలో సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఆదివారాలు నాలుగు వస్తున్నాయి. ఈ నెల 25న మొదటి, ఫిబ్రవరి 1న రెండు, 8న మూడు, 15న నాలుగో ఆదివారాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ క్షేత్రంలో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. మొదటి ఆదివారం నాడే రథసప్తమి పర్వదినం కావడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో ఆవు పిడకలతో నిచ్చలి కుంపటి వేసి, దానిపై పాలు పొంగించుకుని, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి పరమానాన్ని నివేదిస్తారు. సూర్య నమస్కారాలు చేసుకుని, ఆరోగ్యం ప్రసాదించాలంటూ ఆ స్వామిని వేడుకుంటారు. అనంతరం, శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణునితో పాటు మూల భావనారాయణ స్వామిని, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటారు.

సర్పవరం పేరు.. వచ్చిందిలా..

స్థల పురాణం ప్రకారం.. ఒకప్పుడు నారద మహర్షి గర్వంతో శ్రీమన్నారాయణుడి శాపానికి గురై సీ్త్రగా మారిపోయాడు. దీంతో, గర్వభంగమై.. స్వామివారి కారుణ్యంతో.. ఆ రూపాన్ని పోగొట్టుకునేందుకు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఇక్కడి పుష్కరిణిలో స్నా నమాచరించడంతో అతడి పాపం పోయి, పాత రూ పం వచ్చింది. అనంతరం నారదుడికి ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు.. ఇక్కడ భావనారాయణ స్వామిగా స్వ యంభువుగా వెలిశారు. స్వామి వారిని దర్శించుకున్న నారదుడు ఇక్కడే రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించాడు. ఐదు వేల సంవత్సరాల క్రితం భావనారాయణ స్వామి వారు గరుడ వాహనంపై కూర్చుని ఇక్కడ వెలిశారని, ఆ స్వామి విగ్రహం ఆలయ కింది భాగంలో ఉండటంతో పాతాళ భావనారాయాణుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెబుతారు. అలాగే, ఈ దివ్య క్షేత్రంలో అనంతుడనే సర్పం మూల భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడని, తద్వారా ఈ గ్రామానికి సర్పపురి.. సర్పవరంగా పేరు వచ్చిందని అంటారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా..

మాఘ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఆదివారాల్లో ఆలయం వద్ద జరిగే తిరునాళ్లకు వేలాదిగా భక్తులు వస్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వారికి ఇబ్బంది లేకుండా క్యూలు ఏర్పాటు చేశాం. ఆదివారాల్లో గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాం.

– రాపాక శ్రీనివాసరావు, భావనారాయణ స్వామి

ఆలయ కార్యనిర్వహణాధికారి

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం1
1/3

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం2
2/3

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం3
3/3

సర్పవరం.. ఆధ్యాత్మిక సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement