దిగుబడిన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

దిగుబడిన కష్టాలు

Jan 24 2026 8:47 AM | Updated on Jan 24 2026 8:47 AM

దిగుబ

దిగుబడిన కష్టాలు

జిల్లాలో మిర్చి తోటలపై ‘నల్లి’ తెగులు

దిగుబడులపై తీవ్ర ప్రభావం

నష్టాల ఊబిలో రైతన్నలు

క్వింటా రూ.21 వేలు దాటినా దిగాలే

ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

ఎటపాక: ఎర్ర బంగారమైన మిర్చికి ‘ధర’హారం వచ్చింది.. అంచనాలకు మించి రేటు పెరిగింది.. ప్రస్తుతం ఈ సాగులో నల్లి తెగులు దిగుబడులపై ప్రభావం చూపుతోంది.. ఫలితంగా ధర బాగున్నా రైతులకు కష్టమే మిగులుతోంది.. ఐదేళ్ల నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మిర్చి తోటలు సాగు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎంతో ఆశతో సాగు చేస్తున్న వాణిజ్య పంట మిర్చి ఈ ఏడాదీ కంటనీరు పెట్టించింది.

జిల్లాలో ప్రధానంగా చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు, పోలవరం ముంపు భూములతో సహా సుమారు 6 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు. అయితే ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2,300 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఐదేళ్ల కిందట సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. రాను రాను సగం వరకూ విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లి ప్రభావంతో ఈ ఏడాది కూడా మిర్చి సాగులో దిగుబడులు తగ్గుతున్నాయి. ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే ప్రస్తుతం ఎర్ర, నల్ల నల్లి తెగుళ్లు మిర్చి తోటలను ఆశించాయి. వీటి ప్రభావం నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఈ తెగులు కారణంగా మిర్చి పూత, పిందె, ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడంతో తోటలు నల్లగా మాడిపోతున్నాయి. ఈ ఏడాది సుమారు నెల రోజులు ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడడంతో ముందుగా వచ్చిన పంటే కొందరు రైతులకు చేతికి అందింది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ తెగులు కారణంగా కేవలం పది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గోదావరికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో వరదల ఉధృతి అధికంగా ఉండడంతో మిర్చి సాగు ఆలస్యమైంది.

సాగు విస్తీర్ణం తగ్గింది

ఎర్ర, నల్ల నల్లి తెగులు ప్రభావంతో మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కొంత ఆలస్యంగా వేసిన మిర్చి తోటలను ఈ ఏడాది నల్లి ఆశించింది. దీని ప్రభావం మళ్లీ దిగుబడులపై పడింది. పురుగు మందులు, ఎరువులు అధికంగా వాడటం, పంట మార్పిడి చేయకపోవడంతోనే ఈ నల్లి తీవ్రత పెరుగుతోంది.

–ముత్తయ్య, ఉద్యాన శాఖ అధికారి,

చింతూరు డివిజన్‌

ప్రతి ఏటా నష్టాలే..

సాగు చేసిన ఎకరం మిర్చి తోట ఈ ఏడాది కూడా నల్లి ప్రభావంతో దెబ్బతింది. దిగుబడి బాగుంటే, ఈ ఏడాదైనా అప్పుల నుంచి బయటపడే వాడిని. ధర చూసి ఆనంద పడాలో, దిగుబడి లేదని బాధపడాలో అర్థం కావడం లేదు. ప్రతి ఏటా నష్టాలు తప్పడం లేదు.

–చుండ్రు రాజా, రైతు, గౌరిదేవిపేట

ఎన్ని మందులు వాడినా..

ఎర్ర, నల్ల నల్లి నివారణకు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం కనపడడం లేదు. గోదావరి వరదల ముంపు భూముల్లో సాగు చేసిన మిర్చి తోటల్లో అధికంగా ఈ నల్లి ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రమే.

–గొడపర్తి వెంకటేశ్వరరావు, రైతు, నందిగామ

ఎక్కడెక్కడ.. ఎంతెంత

చింతూరు మండలం ఏజీకోడేరు, ముకునూరు, కల్లేరు, చూటూరు, కూటూరు, ఈడిపల్లి, ఎటపాక మండలం నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట, గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, పిచుకలపాడు, రాయనపేట, గన్నవరం పరిసరాల్లో మిర్చి సాగు అధికంగా ఉంది. వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లో సాగు తక్కువగా చేస్తున్నారు. ఎటపాక మండలంలోనే అధికంగా 60 శాతం సాగు చేసిన్నట్లు అధికారులు చెబుతున్నారు. నల్లి తెగులు ప్రభావంతో మిర్చి సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. దిగుబడులు తగ్గడంతో పంటలు వేయడానికి రైతులు వెనకాడుతున్నారు.

ధరలు పెరిగినా..

ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో క్వింటా మిర్చి రూ.21 వేలపైనే పలుకుతుంది. లావు రకం మిర్చి క్వింటా రూ.27 వేలపైనే ఉంది. ఐదేళ్ల కిందట రూ.10 వేల వరకూ మాత్రమే ధర వచ్చేది. అయితే వరుసగా నష్టాలు వస్తుండటంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి సాగు చేస్తున్న రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తే ఈ ఏడాదైనా అప్పులు తీరుతాయని భావించారు. కానీ ఆలస్యంగా సాగు ప్రారంభించిన రైతులకు ఈ ఏడాది కాలం కలిసి రావడం లేదు. నల్లి ప్రభావంతో దిగుబడులు తగ్గి పెట్టుబడులకు చేసిన అప్పులు కూడా తీరవని ఆందోళన చెందుతున్నారు.

దిగుబడిన కష్టాలు1
1/2

దిగుబడిన కష్టాలు

దిగుబడిన కష్టాలు2
2/2

దిగుబడిన కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement