మూడో విడతలో గులాబీ గుబాళింపు
మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా సత్తా చాటిన స్వతంత్రులు మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
కై లాస్‌నగర్: జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఈ విడతలో రుయ్యాడి మినహా 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. తొలి, రెండో విడతలో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ మూడో విడతలో చతికిలపడింది. తృతీయ స్థానానికి పరిమితమైంది. బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరగడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇలాఖా కావడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయఢంకా మోగించారు. రెండో విడతలో సత్తా చాటిన బీజేపీ కేవలం సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక స్వతంత్రులుగా బరిలో దిగిన చాలా మంది పలుచోట్ల సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టిపోటీనిస్తూ సర్పంచ్‌లుగా గెలుపొందారు. పలుచోట్ల బీఆర్‌ఎస్ మద్దతుదారులు, స్వతంత్రుల నడుమ హోరాహోరీ పోరు సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్న గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో పలుచోట్ల జయాపజయాలు స్వల్ప ఓట్లతో దోబూచులాడాయి. గుడిహత్నూర్ మండలం ముత్నూర్ తండాలో రెండు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా జాదవ్ రాంజీ ఎన్నికయ్యారు. ఈ విడతలతో ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా బీఆర్‌ఎస్ అత్యధికంగా 71సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా స్వతంత్రులు 48 చోట్ల విజయం సాధించారు. ఇక అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 25 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు కేవలం ఏడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం రాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్‌ల ఫలితాలను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక నిర్వహించారు. మెజార్టీ ఉపసర్పంచ్ స్థానాలను సైతం బీఆర్‌ఎస్ తన ఖాతాలోనే వేసుకుంది. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఆర్‌వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తమ అభిమాన నాయకులు గెలుపొందడంతో వారి అనుచరులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
మండలం ఎన్నికలైన జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
బజార్‌హత్నూర్ 31 05 17 03 06
బోథ్ 21 03 10 01 07
గుడిహత్నూర్ 26 01 10 01 14
నేరడిగొండ 32 06 23 00 03
సొనాల 12 03 04 01 04
తలమడుగు 28 06 07 01 14


