వలస ఓటర్లకు గాలం
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాం వదులుకోవడం లేదు. గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్ రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడా ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు రావాలని కోరుతున్నారు. కొంత మంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంత మొత్తం ముట్టజెబుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
సర్పంచ్‌కు నీఇష్టం..వార్డుకు మాత్రం నాకే ఓటెయ్
మూడో విడత ప్రచారం జోరందుకుంది. మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ బలపరిచే సర్పంచ్ అ భ్యర్థులు గెలుపే లక్ష్యంగా పార్టీ మద్దతుదారులైన వార్డు సభ్యులకు కొంతమేర ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రామాల్లో ఓటర్లు వార్డు సభ్యుల అభ్యర్థులకు అనుకూలంగా ఉండి, సర్పంచ్ అభ్యర్థిపై నిరుత్సాహంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డు సభ్యుల అభ్యర్థులు, సర్పంచ్‌కి నీయిష్టం.. వార్డులో నాకు తప్పనిసరిగా ఓటు వేయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.


