సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్‌పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సాగే శ్రీనివాస్ (35) మంచిర్యాలలో ఇంటర్ నెట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తున్నా సంతానం కలుగడంలేదని రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సరిత ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.


