● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్ర
కై లాస్‌నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..’ అని కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షిషా అన్నారు. మంగళవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
కలెక్టర్: ఈ నెల 11న జిల్లాలోని గాదిగూడ, నా ర్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పీవో, ఓపీవోల మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి విధులు కేటాయించాం. వారు బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
సాక్షి: ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?
కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఇందులో 46 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 33 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా సాయుధ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం.
సాక్షి: మద్యం, డబ్బు ప్రలోభాలను ఏవిధంగా కట్టడి చేస్తారు?
కలెక్టర్: ఇప్పటికే ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలోని వైన్స్‌లను మూసివేయాలని ఆదేశించాం. ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా డబ్బులు, మద్యం పంచినట్లయితే ప్రజలు డయల్ 100, టోల్‌ఫ్రీ నం.18004251939 కు సమాచారం అందించాలి.
సాక్షి: రోడ్డు సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది.. వాటిపై ఏవిధంగా దృష్టి సారించారు..?
కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో కేవలం ఉట్నూర్ మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికే ఈ పరిస్థితి ఉన్నట్లుగా గుర్తించాం. సిబ్బంది వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం.
సాక్షి: ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.. ఈ పరిస్థితిని ఏవిధంగా అధిగమిస్తారు..?
కలెక్టర్: ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు విడుదల చేసింది. ఈసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతీ మండలానికి అవసరమైన నిధులు కేటాయించాం. వారికి సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు.
సాక్షి: పోలింగ్ శాతం పెంపునకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు..?
కలెక్టర్: అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో పోల్ చీటీలను ఓటర్లకు అందించాం. ఇప్పటివరకు 95 శాతం ప్రక్రియ పూర్తయింది. ఒకరోజు సమయం ఉండడంతో ప్రతిఒక్కరికీ అందజేస్తాం. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 గుర్తింపుల్లో ఏదైన ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లి ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అందించాం.
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్ర


