ఓటరు.. బీ కేర్ ఫుల్!
బోథ్: ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బంధుత్వాలు కలుపుతూ.. ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే గుడ్డిగా నమ్మి ఓటేయద్దు. వారి గుణగణాలను పరిశీలించాలి. పాలనలో సామర్థ్యాన్ని అంచనా వేయాలి. లేకుంటే సీన్ రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ రోజు మందు, డబ్బులు పంపిణీ చేసిన వారిని గెలిపిస్తే రేపు వాళ్లు చేయాల్సిన పనులకు సైతం రేట్లు నిర్ణయిస్తారు. ఇంతకు చాలా రెట్లు అధికంగా వసూలు చేస్తారనే విషయం మరువొద్దు.
ఆలోచించండి.. నిర్ణయం తీసుకోండి
పంచాయతీ ఎన్నికలనేవి పల్లె ప్రగతికి ప్రాతిపదిక. అందుకే తాత్కాలిక పలకరింపులు, డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికావొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు వేసే ముందు ప్రధానంగా ఈ అంశాలు గమనించాలి.
‘అక్క.. బావ లేడా.. ఎటుపో యిండు.. అల్లునికి ఓటుంది కదా.. అత్తమ్మ.. మామయ్యవి కలిపి ఐదోట్లు మనకే పడాలే.. మీకేం కావాలన్నా చేసి పెడతా.. సాయంత్రం బావతో మాట్లాడుతా..’ అంటూ ఓ అభ్యర్థి ఇంటింటి ప్రచారం సాగుతుందిలా.
‘తమ్మీ.. మన దగ్గర ఎంత మంది ఉన్నరు.. యూత్ అందరినీ సాయంత్రం పిలువు.. ఓ కాడ కూకుండవెట్టు.. వాళ్లను చిల్డ్ చేద్దాం.. వాళ్లకేం కావాల్నో అడు గు.. ఇచ్చేద్దాం.. నిన్ను నేను చూసుకుంటా.. నువ్వు నా రైట్ హ్యాండ్ లెక్క.. గెలిచినంక ఏ పని కావాలన్నా చేసే బాధ్యత నాది..’ అంటూ మరో అభ్యర్థి యూత్ ఓట్ల కోసం గాలం వేస్తున్నాడు.


