ఆడబిడ్డలకు అండగా.. ‘పోలీస్ అక్క’
నూతన కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం విద్యాసంస్థలు, గ్రామాల్లో సందర్శన వేధింపులకు చెక్‌పెట్టేందుకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు పోలీసుశాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాకు వచ్చిన ఏడు నెలల్లోనే భద్రత విషయమై పలు కార్యక్రమాలను ప్రారంభించారు. పోకిరీలు, అక్రమార్కులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో యువతులు, మహిళలు, విద్యార్థినులపై వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ‘పోలీసు అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీపోలీసు స్టేషన్‌కు చెందిన ఓ మహిళ కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరు వారానికి మూడురోజుల పాటు కళాశాలలు, పాఠశాలల్లో, మరో మూడు రోజుల పాటు గ్రామాల్లో సందర్శించి అవగాహన కల్పించనున్నారు. మహిళలతో కలిసి పలు విషయాలు చర్చించనున్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే వారి నుంచి వివరాలు సేకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతారు.
మార్కు చూపుతున్న ఎస్పీ..
ఎస్పీ అఖిల్ మహాజన్ మార్చి 10న జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతూ తన మార్క్ చూపుతున్నారు. ఇప్పటికే మెస్సేజ్ యువర్ ఎస్పీ, ఆపరేషన్ చబుత్రా, పోలీసులు మీకోసం, పిల్లలకు సమ్మర్ క్యాంప్, హోంగార్డు సిబ్బందికి ఆరోగ్య భద్రత, యాంటీడ్రగ్ కమిటీ విధానం, ఆదివాసీలకు మెడికల్ క్యాంపులు, ఆపరేషన్ జ్వాల, రౌడీ మేళా, డ్రైవింగ్ లైసెన్స్ మేళా, గ్రామాల్లో వీపీవో విధానం, మై ట్యాక్సీ సేఫ్ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవి సక్సెస్ అవ్వడంతో తాజాగా పోలీస్ అక్క కార్యక్రమం చేపట్టారు.
ఆడపడుచులకు అండగా..
ఆడపడుచులకు అండగా నిలిచేలా పోలీస్ అక్క కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎస్పీ ప్రారంభించారు. జిల్లాలో ఇటీవల పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థినులను వేధించడంతో వారిపై పోక్సో కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేశారు. ఇంటా, బయట, పాఠశాలలు, కళాశాలలు, పనిచేసేచోట వేధింపులకు గురవుతున్నారు. అయితే కొంత మంది షీటీమ్, పోలీసులను ఆశ్రయించగా, చాలా మంది పరువు పోతుందని ఎవరికి చెప్పుకోలేక తమలో తామే మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా జిల్లాలోని 19 పోలీస్ స్టేషన్లలో ఒక్కో కానిస్టేబుల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. వారానికి మూడు రోజులు ఆ మండలంలోని పాఠశాలలు, విద్యా సంస్థలను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ విద్యార్థులతో మాట్లాడి ఏమైన ఇబ్బందులు పడుతున్నారా, ఎవరైనా వెకిలిచేష్టలు చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకుంటారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తే వారిపై కొరడా ఝుళిపించనున్నారు. అలాగే మరో మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తారు. చట్టాలపై అవగాహన కల్పిస్తారు. ఇబ్బందులకు గురిచేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలనిసూచిస్తారు. వివరాలను గోప్యంగా
ఉంచుతారు.
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం..
మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రత దృష్టిలో ఉంచుకొని పోలీస్ అక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్‌టీజింగ్, నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తాం. జిల్లాలో షీటీంతో పాటు పోలీస్ అక్క ద్వారా కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సమస్యలుంటే నిర్భయంగా పోలీస్ అక్కకు తెలియజేయాలి. 8712659953 నంబర్‌లోనూ సమాచారం అందించవచ్చు.
– అఖిల్ మహాజన్, ఎస్పీ


