ఆలస్యం.. అమృతం!
నత్తనడకన ‘అమృత్’ పనులు
రైల్వేస్టేషన్లో సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేదు. కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్లాట్‌పాంలపైనే నిలబడాల్సి వస్తుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రారంభించిన పనులు నత్తనడకన సాగతున్నాయి. అధికారులు దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
– నీరటి ఉదయ్, సార్క్ మానవహక్కుల
సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆదిలాబాద్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని చందంగా మారింది ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ పరిస్థితి. అమృత భారత్ స్టేషన్ పథకం(ఏబీఎస్‌ఎస్) కింద ఈ స్టేషన్‌ను ఆధునికీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలివిడతగా ఆదిలాబాద్ ఎంపికయింది. రూ.17.80 కోట్ల నిధులు సైతం మంజూరు చేశారు. పనులు మొదలైనా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మిగతా స్టేషన్లలో పనులు తుది దశకు చేరుకుంటున్నప్పటికీ ఆదిలాబాద్‌లో మాత్రం కొనసా..గుతుండడం గమనార్హం.
ఏం చేస్తారంటే...
ఈ పథకంలో భాగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియా, రహదారులు నిర్మిస్తారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా స్వాగత ద్వారంతో పాటు రద్దీ దృష్ట్యా మరో ద్వారం ఏర్పాటు చేస్తారు. అలాగే అందరికీ అర్థమయ్యేలా సైన్ బోర్డుల ఏర్పాటు, ప్రయాణికులు ప్లాట్‌ఫాంల పైకి సులభంగా చేరుకునేలా ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు, లిఫ్టులు ఏర్పాటు వంటివి ఉంటాయి. అలాగే ఎస్కలేటర్స్, వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, ఫ్రీ వైఫై కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటారు.
అన్నీ సమస్యలే..
ఈ స్టేషన్‌లో ప్రయాణికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాం పైకి వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సిన దుస్థితి. వాహనాల పార్కింగ్ సమస్య ఉంది. మరోవైపు స్టేషన్ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
ప్లాట్‌ఫాంలపై రూఫ్ టాప్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలంలో ఇప్పుడిప్పుడే డ్రెయినేజీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. లిఫ్టులు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జి వంటి పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరోవైపు పిట్‌లైన్ నిర్మాణం తుదిదశకు చేరుకున్నా, రైళ్లనిర్వహణ మాత్రం ప్రారంభం కావట్లేదు. స్వాగత ద్వారం పనులు ఇంకా షురూ కాలేదు. కాగా, పనుల విషయమై సంబంధిత అధికారులను సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఆలస్యం.. అమృతం!


