పకడ్బందీగా పత్తి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పత్తి కొనుగోళ్లు

Oct 27 2025 8:08 AM | Updated on Oct 27 2025 8:08 AM

పకడ్బ

పకడ్బందీగా పత్తి కొనుగోళ్లు

స్లాట్‌ బుకింగ్‌పై రైతులకు అవగాహన తేమ 8శాతం ఉంటేనే మద్దతు ధర రూ.8,110 12 శాతం మించితే కొనుగోలుకు నిరాకరణ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు.. 33 జిన్నింగ్‌లు నేటి నుంచి ఆదిలాబాద్‌ యార్డులో షురూ.. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మార్కెటింగ్‌ ఏడీ గజానంద్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీసీఐ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఈసారి కేంద్ర ప్రభుత్వం కపాస్‌ కిసాన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.. ఈ విధానం ద్వారా రైతులు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని కేంద్రాలకు పత్తి బండ్లను తీసుకురావాల్సి ఉంటుంది.. అయితే నిబంధనల ప్రకారం 8 నుంచి 12శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేసే వీలుంటుందని జిల్లా మా ర్కెటింగ్‌ శాఖ అధికారి గజానంద్‌ తెలిపారు. సోమవారం నుంచి ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు, నిబంధనలు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

సాక్షి: పత్తి కొనుగోళ్లకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. ఎన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుపుతారు..?

ఏడీ: ప్రస్తుతం ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నాం. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రైతులకు అనుగుణంగా విక్రయాలు ఉంటాయి. వచ్చేనెల మొదటి వారంలో జిల్లాలోని మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా వ్యాప్తంగా 11 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఐదు మార్కెట్‌ యార్డుల పరిధిలో 33 జిన్నింగ్‌లను సిద్ధం చేసి ఉంచాం.

సాక్షి: రైతుల్లో దాదాపు నిరక్షరాస్యులే ఉన్నారు. స్లాట్‌ బుకింగ్‌పై వారికి ఏవిధంగా అవగాహన కల్పిస్తారు.?

ఏడీ: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయా గ్రామాల్లో ఏఈవోల ద్వారా కపాస్‌ కిసాన్‌ యాప్‌ స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ఏ రైతుకు కూడా ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతున్నాం.

సాక్షి: నెట్‌వర్క్‌ లేనిచోట స్లాట్‌ బుకింగ్‌కు ఇబ్బందులు కలుగుతుంది. అక్కడి రైతుల పరిస్థితి ఏమిటి?

ఏడీ: జిల్లాలోని 48 గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్య ఉన్నట్లు గుర్తించాం. ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఏఈవోలు నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి సంబంధిత రైతుల స్లాట్‌ బుకింగ్‌ చేస్తారు.

సాక్షి: కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.?

ఏడీ: ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ప్రస్తుతం 11 కాంటాలను ఏర్పాటు చేశాం. జిన్నింగ్‌ మిల్లుల్లో రైతులు సేద తీరేందుకు వసతి కల్పనతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలు కురిస్తే పంట తడవకుండా టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. మార్కెట్‌ యార్డులో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాం.

సాక్షి: ప్రతీసారి కొనుగోళ్ల సమయంలో ప్రతిష్టంభన నెలకొని రైతులు రోడ్డెక్కాల్సి వస్తోంది. ఈసారి ఈ పరిస్థితి మారుతుందా..?

ఏడీ: రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టాం. తేమ నిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచాం. జిన్నింగ్‌ మిల్లులో మోసాలు జరగకుండా లోకల్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో తహసీల్దార్‌, ఎస్సై, ఏవో, మార్కెటింగ్‌ కార్యదర్శి, సీపీవోలు ఉన్నారు. ఏ సమస్యలున్నా పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది.

సాక్షి: భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతోంది.. ఈఏడాది ఎన్ని క్వింటాళ్ల పత్తి వచ్చే అవకాశం ఉంది.?

ఏడీ: గతేడాది సీసీఐ ద్వారా 25 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. ప్రైవేట్‌ వ్యాపారులు 2లక్షల 50వేల పత్తిని కొనుగోలు చేశారు. ఈసారి భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే 30 లక్షల క్వింటాళ్ల వరకు అంచనా వేశాం.

సాక్షి: రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?

ఏడీ: రైతులు పత్తి పంటను ఆరబెట్టిన తర్వాత మార్కెట్‌కు తీసుకురావాలి. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ ఉంటే మద్దతు ధర లభిస్తుంది. ఏవైనా సమస్యలు ఉంటే వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులను సంప్రదించాలి. తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దు. యార్డులో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. కిసాన్‌ కపాస్‌ యాప్‌కు సంబంధించి సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. రోజుకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వెయ్యి బండ్ల వరకు కొనుగోలు చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

సాక్షి: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలో చలి తీవ్రంగా ఉంటుంది.. తేమశాతంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సడలింపు చేసే అవకాశం ఉందా..?

ఏడీ: మీరన్నది వాస్తవమే. అయినప్పటికీ సీసీఐ నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుంది. రైతులు పత్తిని ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలి. 8 నుంచి 12 శాతం తేమ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది. 8 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే క్వింటాలుకు కేజీ చొప్పున కోత ఉంటుంది. 12 శాతం దాటితే మాత్రం కొనుగోలు చేయడం జరగదు.

పకడ్బందీగా పత్తి కొనుగోళ్లు1
1/1

పకడ్బందీగా పత్తి కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement