పుస్తకాలతోనే సంపూర్ణ జ్ఞానం
ఆదిలాబాద్: పుస్తకాలతోనే సంపూర్ణ జ్ఞానం సాధ్యమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉంటుందని తెలిపారు. చిన్నతనం నుంచి విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలనిన్నారు. పుస్తక పఠనంతో విద్యార్థుల్లో స్వీయ ఆలో చన, సృజనాత్మకత పెంపొందుతాయని అన్నారు. పుస్తకాలు చదవడమే కాకుండా అందులోని మంచి విషయాలను పాటిస్తే జీవితంలో గొప్ప స్థానాలను అధిరోహించవచ్చని సూచించారు. ముఖ్యంగా పార్కులకు చిన్నారుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పార్కులో చిల్డ్రన్ లైబ్రెరీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, కార్యక్రమ నిర్వాహకులు పోరెడ్డి అశోక్, నూతుల రవీందర్ రెడ్డి, పసుల ప్రతాప్, కృష్ణకుమార్, లెనిన్, పలువురు రచయితలు, కవులు, పుస్తక ప్రియులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో మరింతగా రాణించాలి
క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గాంధీ పార్కులో ఆదివారం క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రీడా దుస్తులు, వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికల్లో పతకాలు సాధిస్తుండటం జిల్లాకు గర్వకారణమని అన్నారు. వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 200 మంది విద్యార్థులకు ట్రాక్ సూట్, యూనిఫాం, టీషర్ట్స్, షార్ట్స్, షూ అందించినట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
పుస్తకాలతోనే సంపూర్ణ జ్ఞానం


