కై లాస్‌నగర్: కొంత కాలంగా నిధుల లేమితో సతమతమవుతున్న ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఎట్టకేలకు ఊరట కలిగింది. పట్టణ పరిధిలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందు కోసం రూ.15కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థాయి నిధులు ప్రభుత్వం నుంచి అందనుండటం ఇదే తొలిసారి కావడంతో అధికారులతో పాటు పట్టణ ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికే చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసిన బల్దియా అధికారులు త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ నిధులతో కూడిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పలు కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి.
వేధిస్తున్న నిధుల లేమి
గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీని నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసినప్పటి నుంచి నిధులు అంతగా రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రతి మూడు నెలలకోసారి రావా ల్సిన కేంద్రానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఆరు నెలలకోసారి విడుదలవుతున్నా యి. అవి కూడా కేవలం రూ.3కోట్లు మాత్రమే వస్తుండటంతో పట్టణ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పలు కాలనీల్లో సమస్యలు తిష్టవేశాయి. వాటిని పరిష్కరించాలంటూ స్థానికులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా నిధుల కొరత కారణంగా ఏమి చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్రప్రభుత్వం రూ.2,780 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు కేటాయించింది.
మెరుగుపడనున్న వసతులు..
జిల్లాకేంద్రంలోని అన్ని వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టేందుకోసం మున్సిపల్ అధికారులు ఇదివరకే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల్లోని సమస్యలను అనుసరించి ప్రాధాన్యతక్రమంగా నిధులు కేటాయించారు. ప్రధానంగా పట్టణంలో విలీనమైన కాలనీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బంగారుగూడలో అత్యధికంగా రూ.60లక్షలు, వాల్మీకి, ఆర్‌ఆర్ నగర్, వికలాంగుల కాలనీలకు రూ.90లక్షలు, కేఆర్‌కేలోని 7,8 కాలనీలకు రూ.65లక్షలు, రాంనగర్‌లో రూ.20లక్షలు, న్యూహౌసింగ్‌బోర్డు, భాగవతినగర్, 170 కాలనీలకు రూ.90లక్షల చొప్పున కేటాయించారు. అలాగే ఎంప్లాయీస్ కాలనీలో రూ.85లక్షలు, రణదీవేనగర్, రాంపూర్‌లకు రూ.45లక్షల చొప్పున, టీచర్స్‌కాలనీకి రూ.50లక్షలు, దుర్గానగర్, దస్నాపూర్, సోనార్‌గల్లీకి రూ.40లక్షల చొప్పున, గాంధీనగర్, వరలక్ష్మినగర్‌కు రూ.35లక్షలు కేటాయించారు. వీటితో పాటు పట్టణంలోని మిగతా కాలనీలన్నింటికీ అక్కడి సమస్యల ప్రాధాన్యత క్రమంగా ఒక్కోవార్డుకు రూ.15లక్షల నుంచి రూ.25లక్షల చొప్పున కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈమేరకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. మౌలిక వసతులు మెరుగపడి ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. ముఖ్యంగా విలీన కాలనీల కష్టాలు దూరమయ్యే అవకాశముంది. అలాగే పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్న గాంధీ పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం రూ.50లక్షలు కేటాయించారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ
మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిధులు కేటాయించగా అందులో ఆదిలాబాద్‌కు రూ.15కోట్లు రానున్నాయి. దీనికి సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ఈ నిధుల ద్వారా పట్టణంలోని పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల సమస్యలు దూరం కానున్నాయి.
– సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్
ఆరేళ్ల క్రితం పట్టణంలో విలీనమైన ఎంప్లాయీస్ కాలనీలో ఏ ఒక్క వీధిలో డ్రెయినేజీ నిర్మాణం జరుగలేదు. దీంతో మురుగునీరంతా ఇలా రోడ్డుపైనే నిలిచి ఈగలు, దోమలకు ఆవాసంగా మారుతుంది. ఈ కాలనీకి తాజాగా రూ.85లక్షల నిధులు కేటాయించడంతో ఈ సమస్యలు దూరమయ్యే అవకాశం ఏర్పడింది.
ఇది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆరేళ్ల క్రితం విలీనమైన 170 కాలనీలోని ఓ రోడ్డు దుస్థితి. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే పారుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇలా బురదమయంగా మారింది. తాజాగా ఆదిలాబాద్ మున్సిపల్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఈ ఇక్కట్లు ఇక తీరనున్నాయి.
నిధుల మంజూరుకు కృతజ్ఞతలు..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డికి మే 17న వినతిపత్రం అందించినట్లు తెలిపారు. పట్ట ణంలోని 52 పనుల కోసం నిధులు కేటా యించాలని అందులో విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
బల్దియాకు ఊరట


