లక్కెవరిని వరించేనో
నేడు మద్యం దుకాణాల ఎంపిక 34 షాపులు లక్కీ డ్రా ద్వారా.. 10లోపు దరఖాస్తులు వచ్చిన 6 షాపులు వాయిదా.. జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి
ఆదిలాబాద్‌టౌన్: వైన్స్ షాపుల లక్కీడ్రాలో అదృష్టం ఎవరికి వరించనుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. దీంతో అందరి దృష్టి అటువైపే ఉంది. 2025–27 నూతన ఎకై ్సజ్ పాలసీకి సంబంధించి గతనెల 26 నుంచి ఈనెల 18 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. తక్కువ దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పెంచింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. ఆరు షాపులకు 10 కంటే తక్కువగా రావడంతో వాటిని వాయిదా వేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ తెలిపారు. 34 షాపులకు సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని మావలలో గల రత్నాగార్డెన్‌లో కలెక్టర్ రాజర్షిషా లక్కీడ్రా తీయనున్నారు. దీంతో లక్కు.. కిక్కు ఎవరికి దక్కనుందోనని దరఖాస్తుదారుల్లో టెన్షన్ మొదలైంది. కాగా లక్కీడ్రా కోసం ఎకై ్సజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అదృష్టం ఎవరికి దక్కెనో..
జిల్లాలో 40 వైన్స్ షాపులు ఉన్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా 34 దుకాణాలకు సంబంధించి డ్రా తీయనున్నారు. ఆరు షాపులకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆదిలాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని షాప్ నం.16,17,18 తాంసి, తలమడుగు, భీంపూర్ షాపులకు వాయిదా పడింది. అలాగే ఇచ్చోడ పరిధిలో షాప్ నం.25, 28 అడెగామ, సిరికొండ, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో షాప్ నం.40 లోకారికి లక్కీడ్రా వాయిదా వేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి ఎంపికై న వారిని ప్రకటించనున్నారు. షాపు దక్కిన వారు 1/6 వంతు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో మద్యం షాపులు మూడు స్లాబ్‌లుగా ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని షాపులకు ఏడాదికి రూ.65లక్షలు, ఇతర షాపులకు రూ.55లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.50లక్షలుగా ఉన్నాయి. దుకాణాలకు లైసెన్స్ కోసం ఏడాదిలో ఆరు విడతలుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నూతన పాలసీ ద్వారా షాపులు దక్కించుకున్న వారు రెండేళ్ల పాటు నడపవచ్చు. ఈ షాపులకు ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి 2027 వరకు గడువు ఉంటుంది.
ప్రభుత్వానికి రూ.23.13 కోట్ల ఆదాయం..
నూతన మద్యం పాలసీ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.23.13 కోట్ల ఆదాయం సమకూరింది. టెండర్‌దారులు ఒక్కో షాప్‌కు రూ.3లక్షల చొప్పున 40 షాపులకు నాన్‌రిఫండబుల్ చలాన్, డీడీ రూపంలో చెల్లించారు. జిల్లాలో 771 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపుకు రూ.3లక్షల చొప్పున డీడీ చెల్లించారు. అయితే 2023లో 1047 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.21 కోట్ల వచ్చింది. ఈసారి దరఖాస్తులు తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం గతంతో పోల్చితే ఎక్కువగానే వచ్చింది.
ఏర్పాట్లు పూర్తి..
లక్కీడ్రా ప్రక్రియ కోసం ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లక్కీడ్రా కోసం వందల సంఖ్యలో టెండర్‌దారులు, వారి సంబంధికులు చేరుకోనుండడంతో సందడి నెలకొననుంది. లక్కు దక్కిన వారు చలాన్ తీసేందుకు అక్కడే ప్రత్యేకంగా బ్యాంక్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తెలిపారు. టెండర్‌దారులకు పాస్‌లు కేటాయించామని, అవి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్లు వివరించారు. ఉదయం 11 గంటలకు లక్కీడ్రా ప్రారంభం కానుందని, 9 గంటలకే దరఖాస్తుదారులు కేంద్రానికి చేరుకోవాలని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని సూచించారు. ఎంపికై న వారు అదేరోజు, లేదా మరుసటి రోజు కేటాయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.


