
బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. విజయయాత్రలో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్ల గర్భాలయాలలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేక, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం
పూజల అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ హిందువు కర్తవ్యమని, ధార్మిక విలువలతో జీవించడం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం..
బాసరలో నూతనంగా నిర్మించిన లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. వేలేటి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంజనాదేవి, బాసర గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదాలు అందజేస్తున్న శృంగేరీ పీఠాధిపతి
మహాకాళి అమ్మవారి ఆలయంలో హారతి ఇస్తున్న విధుశేఖర భారతీస్వామి

బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలు