
ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో ఈనెల 15న చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజీ ఽఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సిరికొండ లక్ష్మణ్, మహా రాష్ట్రలోని రాజూరా తాలూకా చున్నాల గ్రామానికి చెందిన కాకట్ల కేశవరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈఇద్దరు నిందితులపై ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన భీమారం ఎస్సై శ్వేత, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, సిబ్బంది మల్లయ్య, కిరణ్‌ను సీఐ అభినందించారు.