
బీఏఎస్ విద్యార్థులను అనుమతించండి
కైలాస్‌నగర్: బెస్ట్ అవేలబుల్ స్కూల్ (బీఏఎస్) విద్యార్థులను తక్షణమే పాఠశాలల్లోకి అనుమతించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఏఎస్‌కు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏడు పాఠశాలల్లో 1,123 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ పథకం కింద చదువుతున్నారని అన్నారు. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యార్ధులను, తల్లిదండ్రులను మాత్రం ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. కాగా, తమకు మూడేళ్లుగా బకాయిలు రావడం లేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ యజమానులు పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలోనే 40 శాతం బకాయిలు విడుదల చేయనుందని, మిగతాది మార్చిలోగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు యాజమాన్యాలు అంగీకరించి విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎస్సీడీవో సునీతాకుమారి, గిరిజన సంక్షేమాధికారి అంబాజీ, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయం సందర్శన..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ రాజర్షి షా అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సన్నద్ధత, సమస్యలపై ఆరా తీశారు. ఉన్నతంగా రాణించేలా శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బార్బర్ ఇంటికి వెళ్లిన జిల్లా పాలనాధికారి..
పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన లింగంపల్లి నర్సిములు–శ్రావణిల దంపతుల కుమారుడి నామకరణ కార్యక్రమం వాటి ఇంట్లో బుధవారం జరిగింది. ఆ కుటుంబీకుల ఆహ్వానం మేరకు కలెక్టర్ రాజ ర్షి షా వారి ఇంటికి వెళ్లి అతిథ్యాన్ని స్వీకరించారు. చిన్నారిని ఆశీర్వదించారు. కాగా నర్సిములు కలెక్టర్‌కు క్షవరం చేస్తుంటారు. కలెక్టర్ తమ ఇంటికి రావడంతో కుటుంబీకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
వరిధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్
కైలాస్‌నగర్: వరిధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని, ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 చొ ప్పున కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లుగా తెలిపారు. అలాగే సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.500 చొప్పున బోనస్ అందించనుందని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఏవో శ్రీధర్‌స్వామి, సివిల్ సప్‌లె ౖడీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. వారికి పలు సూచనలు చేశారు. ప్రతీ కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించేలా చూడాలని ఆదేశించారు.