
మక్కల కొనుగోలుకు వేళాయె
‘వానాకాలం’ విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు రెండు రోజుల్లో ప్రారంభించే అవకాశం
ఇచ్చోడ: ఈ ఏడాది వానాకాలంలో సాగైన మొక్కజొన్న కొనుగోళ్లపై సందిగ్ధం తొలగిపోయింది. ఈ సీజన్‌కు సంబంధించి మక్కల విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో కొన్నేళ్లుగా యాసంగిలో మాత్రమే మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా యాసంగి పంటనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పత్తి, సోయాకు ప్రత్యామ్నాయంగా వానాకాలంలోనూ జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో విక్రయాలపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే కొంతమంది చేతికొచ్చిన పంట దిగుబడిని యార్డులకు తరలించారు. ఎట్టకేలకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొక్కజొన్న సాగు..
జిల్లాలో ఈ సీజన్‌లో ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండ, తాంసి, తలమడుగు, గాదిగూడ, సొనాల తదితర మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. ఎరువుల వాడకం, పెట్టుబడి వ్య యం కూడా తక్కువగా ఉండడంతో మొగ్గు చూపా రు. అయితే పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రైతులు ఆశించిన దిగుబడులు చేతికందాయి.
ఐదు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, నార్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు రోజుల్లో ప్రారంభిస్తాం
జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. రెండు రోజుల్లో ఆయా కేంద్రాల్లో విక్రయాలు
ప్రారంభిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం, ఆదిలాబాద్
ఇక్కడ కనిపిస్తున్న రైతు రాకేశ్‌రెడ్డి. ఇచ్చోడ మండలంలోని ముఖరా(బి) గ్రామం. ఈ వానాకాలం సీజన్‌లో ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అయితే పంట విక్రయంపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ప్రభుత్వం ఈ సీజన్‌లోనూ మద్దతు ధరతో మక్కల కొనుగోలు చేపడుతున్నట్లు ప్రకటించింది. సర్కారు నిర్ణయంపై ఇతడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
జిల్లాలో
ఈ సీజన్‌లో మొక్కజొన్న సాగు
: 50వేల ఎకరాలు
మద్దతు ధర (క్వింటాలుకు) : రూ 2,400

మక్కల కొనుగోలుకు వేళాయె