
కదులుతున్న డొంక
భూకబ్జాలో పలు శాఖల అధికారుల పాత్ర! వారి సహకారంతోనే రియల్టర్ల దందా సర్వేయర్‌పై ఇప్పటికే కేసు ‘రెవెన్యూ’ పాత్రపైనా దర్యాప్తు
కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన భూ కబ్జా వ్యవహరంలో రియల్టర్లతో అంటకాగిన అవి నీతి అధికారుల బండారం బట్టబయలవుతోంది. బ్యాంకు తనఖాలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమి ని కాజేసిన బడా రియల్టర్లతో ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు వారికి సహకరించిన అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్ర స్తుతం పొరుగు జిల్లాలో పనిచేస్తున్న మండల సర్వేయర్ శివాజీపైన కేసు నమోదు చేసిన పోలీసులు, భూమాఫియాతో చేతులు కలిపిన రెవెన్యూ, సర్వేల్యాండ్స్ రికార్డ్స్ అధికారుల పాత్రపైనా లోతైన విచారణ జరుపుతున్నారు. వారిపైన కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్..
ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ శివారు రణ దీవేనగర్‌లో గల సర్వేనంబర్ 65/బిలో 1.05 ఎకరాలు, 64/4లో గల 1.04 ఎకరాలు కలిపి 2.09 ఎకరాల భూమి ఆర్థిక నేరాల కేసులో ఈడీ ఆధీనంలో ఉంది. రూ.కోట్ల విలువైన భూమి కావడంతో బ డా రియల్టర్లు దానిపై కన్నేశారు. రెవెన్యూ అధి కారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించారు. దొడ్డిదారిన ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 2023 ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వేల్యాండ్ రికార్డ్స్‌లోనూ ఈ భూమి తమ పేరిటనే ఉందని తెలిపేలా పన్నాగం పన్నారు. 2024 నవంబర్‌లో అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్‌ను చేసుకున్నారు. దీనికి సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ కూడా ఆమోదం తెలిపినట్లుగా పోలీసులు గుర్తించా రు. ఈ వ్యవహారంలో నాటి ఆదిలాబాద్ అర్బన్ మండల సర్వేయర్‌గా పనిచేసిన శివాజీ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన సదరు అవినీతి అధికారి ప్రస్తుతం పరా రీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే అక్రమంగా చేసిన సేత్వార్, రిజిస్ట్రేషన్‌పై కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు అందడంతో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారుల పాత్రపై విచారణ..
ఈ మొత్తం వ్యవహారంలో పరారీలో ఉన్న మండల సర్వేయర్ ప్రధాన పాత్ర పోషించినట్లుగా స్పష్టమవుతుంది. ఇదే కాకుండా సర్వేయర్‌గా పనిచేసిన స మయంలో మావలలో ప్రతీ వెంచర్‌లోనూ ప్రభు త్వ, అసైన్డ్ ల్యాండ్స్‌ను రియల్టర్లు ఆక్రమించేలా స దరు అధికారి తనవంతు సహకారం అందించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు అప్పటి రెవెన్యూ అధికారులు సైతం భూకబ్జాలు వారికి తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరించారని సమాచారం. ఇందుకు వారికి పెద్ద మొత్తంలోనే లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ అధికారుల బాగోతంపైనా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో భాగస్వాములైన రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులేవరనే దానిపైనా కలెక్టర్ రాజర్షి షా సైతం ఆరా తీస్తున్నారు. దీంతో బాధ్యులపై శాఖాపరంగానూ వేటు పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
బాధ్యులపై చర్యలు తప్పవు
ఈడీ ఆధీనంలోని భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. ఈ అక్రమదందాలో వ్యాపారులకు సహకరించిన మండల సర్వేయర్ శివాజీపై కేసు నమోదు చేశాం. ఆయనతో పాటు రియల్టర్లకు సహకరించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అక్రమార్కులందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తాం.
– ఎల్.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్