
మాలలను అణచివేసేందుకు కుట్ర
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణలోని రాజకీయ పార్టీ లు మాలలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాలల సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేసినప్పటికీ మాల నాయకులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ వర్గీకరణ విషయంలో మాట్లాడలేదని, అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని అన్నారు. హస్తం పార్టీ ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్గీకరణ చేపట్టారని తెలిపారు. అయితే తాము మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మాలల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చెప్పిన విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని తెలిపారు. వర్గీకరణతో వందలో నలుగురికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ జాబితాలో 1108 కులాలు ఉన్నాయని, వారందరికీ ఏవిధంగా ఫలాలు పంచుతారని ప్రశ్నించారు. ఆయన వెంట మాల మహానాడు నాయకులు బల్లెం లక్ష్మణ్, ప్రభాకర్‌రావు, బాలచౌరి, తదితరులున్నారు.