
బాధితులకు సత్వర న్యాయం అందాలి
కై లాస్‌నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ అఖి ల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతి, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులు వంటి అంశాలపై పోలీస్‌స్టేషన్లు, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పుర్వాపరాలు పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే బాధితులకు పరిహారం జమచేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్‌కలెక్టర్ యువరాజ్, అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎస్సీడీవో సునీత కుమారి, ఆర్డీవో స్రవంతి, కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం..
నీతి ఆయోగ్ యూజ్ కేసు ఛాలెంజ్‌లో నాలుగు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమావేశం అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇందులో సభ్యులు ఆరెల్లి మల్లేశ్, మేస్రం జంగుబాపు, బాల శంకర్‌కృష్ణ, పంద్రం శ్యామల, తోట విజయ్, ఉషారాణి, లక్ష్మికాంత్ తదితరులున్నారు.