
బెస్ట్ కాదు.. వరస్ట్!
కైలాస్‌నగర్/ఆదిలాబాద్‌రూరల్/ఉట్నూర్‌రూరల్: తమ పిల్లలను చదువుకు దూరం చేయవద్దని కోరు తూ జిల్లాలో బెస్ట్ అవలేబుల్ స్కూల్ (బీఏఎస్) వి ద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయం ఎదుట వే ర్వేరుగా ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీంచౌక్ చౌక్ నుంచి తమ పిల్లలతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. అనంతరం సమావేశ మందిరం వద్దకు చేరుకుని గంట పాటు నిరసనకు దిగారు. ప్రజావాణి అనంతరం వారి వద్దకు వచ్చిన కలెక్టర్‌కు తమ గోడును నివేదించారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ విద్యార్థుల ఫీజులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను ఆయా యాజమాన్యాలు బడిలోకి రానివ్వ డం లేదన్నారు. విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించి చదువుకునే అవకాశం కల్పించాలని లే దంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి పిల్లలను బడుల్లో కొనసాగించేలా చూస్తామన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. అలాగే ఉట్నూర్‌లోని ఐటీడీఏ పీ వో కార్యాలయం ఎదుట గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న పీవో ఖుష్బూ గుప్తా తల్లిదండ్రులతో మాట్లాడి సముదాయించారు. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు.