
డీఎస్‌వో వాజిద్ అలీ సరెండర్
కైలాస్‌నగర్: జిల్లా ఇన్‌చార్జి పౌరసరఫరాల అధికారిగా పనిచేస్తున్న వాజిద్ అలీపై సరెండర్ వేటు పడింది. ఆయనను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, శాఖకు సంబంధించి నివేదికలు సకాలంలో అందించకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయినట్లుగా తెలిసింది. అయితే వారం రోజులుగా సెలవుపై ఉన్న డీఎస్‌వో జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అనుమతి తీసుకోకుండానే వెళ్లడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించా రు. క్రమశిక్షణరాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆయనను సరెండర్ చేశారు. కాగా రేషన్‌కార్డుల జారీ సమయంలో డీఎస్‌వో కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ డబ్బులు వసూలు చేసిన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో అప్పట్లోనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలో ఆయనను సరెండర్ చేయడంపై సివిల్ సప్‌లైతో పాటు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఇన్‌చార్జి డీఎస్‌వోగా ఏఎస్‌వో నందినికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు.