
● బతుకమ్మ సంబరాలకు వేళాయె.. ● నేడు ‘ఎంగిలిపూల’తో షురూ ●
మంచిర్యాలటౌన్/దండేపల్లి/ఆసిఫాబాద్‌అర్బన్/చెన్నూర్:
అడవిలో సహజసిద్ధంగా లభించే గునుగు, తంగేడు, చా మంతి, జాజి, రుద్రాక్ష, కట్ల, గానుగ, బీర, గుమ్మడి, మందార పూలను సేకరించి ఇత్తడి తాంబాలంలో బతుకమ్మను పేరుస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు పాడే పాటలు బతుకు చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదించమని గౌరమ్మను కొలుస్తూ సాగే ఈ పండుగంటే ఆడబిడ్డలకు ఎనలేని మక్కువ. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పూల పండుగ ఆదివారం భాద్రపద అమావాస్య(పెత్రామాస) ఎంగిలి పూలతో మొదలవుతుంది. తొమ్మిది రోజులపాటు కొనసాగుతుంది. రోజూ సాయంత్రం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రధాన కూడళ్లలో ఒక్కచోట చేరుస్తారు. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ వాటి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ ఆడుతారు. ఈ నెల 29న సద్దులతో వేడుకలు ముగుస్తాయి. ప్రతీ రోజు బతుకమ్మ ఆడిన తర్వాత సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసి నైవేద్యం ఇచ్చిపుచ్చుకుంటారు.
ఎక్కడైనా దేవుణ్ని పూలతో పూజిస్తారు. అయితే ఆ పూలనే దైవంగా భావించి పూజించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత. తీరొక్క పూలు, ఉయ్యాల పాటలకు గాజుల చప్పట్లు తోడై నేటి నుంచి ఊరూవాడా సందడిగా మారనుంది. అంతటా తొమ్మిది రోజుల పాటు పూలోత్సవ సంబురం అంబరాన్నంటితే ఆదిలాబాద్‌లో మాత్రం పక్షం నుంచి 21 రోజుల పాటు బొడ్డెమ్మగా కొనసాగడం ప్రత్యేకం.

● బతుకమ్మ సంబరాలకు వేళాయె.. ● నేడు ‘ఎంగిలిపూల’తో షురూ ●