
‘సాదా’.. సీదాకు వేళాయె
తెల్లకాగితం ఒప్పందాలకు అధికారిక హక్కులు
సాదా బైనామాలకు ప్రభుత్వ అనుమతి
ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన
రైతుల నిరీక్షణకు తెర
కై లాస్‌నగర్: తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10 వరకు అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటికనుగుణంగా జిల్లాలో అందిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. వారికి భూ యాజమాన్య హక్కులు లభించనున్నాయి. సర్కారు ప్రయోజనాలు చేరువకానున్నాయి.
12 ఏళ్లుగా ఆధీనంలో ఉన్న వాటికే..
చేతిరాత ఒప్పందాల ద్వారా భూ క్రయ, విక్రయాలు చేసుకున్న రైతులకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. భూములు సాగు చేస్తున్నప్పటికీ యాజమాన్య హ క్కులు లేక సతమతమవుతున్నారు. అయితే పన్నెండేళ్లకు పైగా భూమి ఆధీనంలో ఉన్న రైతుల దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు సాదాబైనామా కొనుగోళ్లకు అధికారిక హక్కు కల్పించాలని భావిస్తూ 2016లో రైతుల నుంచి తొలిసారి దరఖాస్తులు స్వీకరించింది. అయితే విచా రణలో జాప్యం కావడం, భూముల ధరలు పెరగడం.. అమ్మిన వారు మొండికేయడంతో పట్టాల జారీ నిలిచిపోయింది. మరోసారి 2020 అక్టోబర్‌లో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. మీసేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించారు. దీంతో జిల్లాలో 2,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధ రణి రెవెన్యూ చట్టంలో నిబంధనలు పొందుపర్చని కారణంగా కోర్టు ఈ ప్రక్రియను నిలిపివేసింది.
కోర్టు ఆదేశాలతో తొలగిన అడ్డంకి..
ఎన్నికలకు ముందు సాదాబైనామాపై ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఈమేరకు జిల్లాలో 947 అందాయి. అయితే వీటి రెగ్యులరైజేషన్‌కు ఆర్‌వోఆర్– 2020 స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌వోఆర్–2025 భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్–6 ద్వారా అవకాశం కల్పించింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది. సాదా బైనామాల కమబద్ధీకరణ ద్వారా రైతులకు భూ పట్టాలు జారీ కానున్నాయి. యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అలాగే ప్రభుత్వం అందించే రైతు భరోసా, రైతు బీమా వంటి ప్రయోజనాలతో పాటు సబ్సిడీ ఎరువులు, బ్యాంకు రుణాలు అందనున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సైతం చేకూరనుంది.
ప్రారంభమైన పరిశీలన..
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సా దాబైనమా దరఖాస్తుల పరిశీలనను ఇటీవల ప్రా రంభించారు. తహసీల్దార్, ఆర్‌ఐ, సర్వేయర్‌లు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నారు. దరఖాస్తుదారు భూమి 12 ఏళ్లుగా తన ఆధీనంలో నే ఉందా, అందుకు సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలు సేకరిస్తున్నారు. అవి సక్రమంగా ఉన్నట్లుగా నిర్ధారణ అయితే సదరు రైతు దరఖాస్తును క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడుతున్నారు.లేనిపక్షంలోవాటిని తిరస్కరిస్తున్నారు.
జిల్లాలో అందిన దరఖాస్తుల వివవరాలు
మండలం అందిన దరఖాస్తులు
ఆదిలాబాద్ అర్బన్ 15
ఆదిలాబాద్ రూరల్ 254
మావల 31
జైనథ్ 168
బేల 60
భీంపూర్ 83
తాంసి 63
తలమడుగు 335
గుడిహత్నూర్ 163
ఇచ్చోడ 98
సిరికొండ 08
నేరడిగొండ 109
బజార్‌హత్నూర్ 97
బోథ్ 222
ఇంద్రవెల్లి 27
నార్నూర్ 52
ఉట్నూర్ 223
ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన
సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటికనుగుణంగా ప్రక్రియ చేపడుతున్నాం. కొన్ని మండలాల్లో దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే ప్రారంభం కాగా మిగతా మండలాల్లోనూ చేపట్టేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి భూములను క్రమబద్ధీకరిస్తాం.
– బి.స్రవంతి, ఆర్డీవో, ఆదిలాబాద్