
కలెక్టరేట్ ఖాళీ చేయడమే ఉత్తమం
కై లాస్‌నగర్: కలెక్టరేట్ ఏ–సెక్షన్ బాల్కనీ పైఅంతస్తు కూలిన ఘటనపై ఇంజినీరింగ్ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 11న ఈ ఘటన చోటు చేసుకోగా, రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం కూలడానికి గల కారణలతో పాటు పటిష్టతను అధ్యయనం చేసేందుకోసం ప్రభుత్వం ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ర్యాప్‌కాన్ కన్సల్టెంట్ ప్రతినిధి పి.కామేశ్, ఈఎం సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి ఈపీ దయాకర్‌రావు, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డితో కూడిన నిపుణుల బృందం ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, డీఈ రమేశ్‌తో కలిసి భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 35 పేజీలతో కూడిన నివేదిక అందజేసింది. ఆప్షన్–ఏ లో పిల్లర్లను మళ్లీ నిర్మించి భవనాన్ని పటిష్టం చేయవచ్చని, స్లాబ్‌లు, గోడల్లో ల్యాప్స్ లేకుండా చేయాలని, వాటర్ ప్రూఫింగ్ చేపట్టవచ్చని తెలిపింది. ఆప్షన్–బిలో భవనం నిర్మించి 80 ఏళ్లు దాటినందున తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన రిస్క్‌గానే పరిగణించింది. మొత్తానికి భవనాన్ని ఖాళీ చేయడమే ఉత్తమమని అభిప్రాయపడుతూ నివేదిక అందజేసింది. కాగా కలెక్టరేట్‌ను ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పెన్‌గంగ భవన్‌కు తరలించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ నివేదిక అందిన నేపథ్యంలో తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
శిథిలాల తొలగింపు పూర్తి..
కలెక్టరేట్‌లో కూలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం పూర్తయింది. ఇందుకోసం కూలీలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.