సైబర్‌ వల.. | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ వల..

Sep 16 2025 7:31 AM | Updated on Sep 16 2025 7:31 AM

సైబర్‌ వల..

సైబర్‌ వల..

ఆన్‌లైన్‌లో మాటువేసిన కేటుగాళ్లు జిల్లాలో పెరుగుతున్న కేసులు లబోదిబోమంటున్న బాధితులు సకాలంలో స్పందిస్తే రికవరీ సులువంటున్న పోలీసులు

సామాన్యులు విలవిల

ఆదిలాబాద్‌టౌన్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడేందుకు సైబర్‌ కేటుగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట వీరి ఉచ్చులో పడి అమాయకులు మోసపోతూనే ఉన్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్న తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల్లో విద్యావంతులే అధికంగా ఉండటం గమనార్హం. తెలియని లింక్‌లు ఓపెన్‌ చేయడం, ఓటీపీలు చెప్పడంతో మోసగాళ్లు వారి పని కానిచ్చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. విద్యా సంస్థలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలని పేర్కొంటున్నారు.

జిల్లాలో పెరుగుతున్న కేసులు..

సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో గతేడాది 200కు పైగా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 165 నమోదైనట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన లోక్‌ అదాలత్‌ ద్వారా రూ.25వేల లోపు ఉన్న బాధితులు 24 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరికి హోల్డ్‌లో పెట్టిన డబ్బులను బ్యాంకుల ద్వారా ఇప్పించినట్లు వెల్లడించారు. అలాగే 35 ఎఫ్‌ఐఆర్‌ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. రూ.17లక్షలను లోక్‌ అదాలత్‌ ద్వారా బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సైబర్‌ క్రైమ్‌ ముఖ్యంగా ఆదిలాబాద్‌ పట్టణం, మావల పోలీసు స్టేషన్‌ పరిధిలో, రూరల్‌ మండలం, ఉట్నూర్‌లో అత్యధికంగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. బాధితులు మోసపోయిన గంటలోపే ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

నేరాలకు పాల్పడుతున్న తీరిది..

సైబర్‌ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంటి వద్ద ఉండి ఉద్యోగం చేయవచ్చు.. ఇందుకు కొంత డబ్బు చెల్లించాలని నిరుద్యోగుల నుంచి విడతల వారీగా లాక్కుంటున్నారు. అలాగే ఇన్వెస్ట్‌ చేస్తే రెండింతలు వస్తాయని మాయమాటలు చెప్పడంతో ఆశపడి కొంత మంది డబ్బులు పోగొట్టుకున్నారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, డిజిటల్‌ అరెస్టుల పేరిట దండుకుంటున్నారు. వాట్సాప్‌ కాల్‌చేసి పోలీసులమని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి బాధితుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచాలని, మీ పిల్లలు మత్తు పదార్థాల కేసుల్లో ఇరుక్కుపోయారని మోసగాళ్లు బాధితుల ఖాతాల్లో నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం..

సైబర్‌క్రైమ్‌ మోసాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కొంత మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బ్యాంక్‌ అధికారులు ఎవరు ఓటీపీ, వ్యక్తిగత సమాచారం అడగరు. వివరాలను బ్యాంక్‌కు వెళ్లి మాత్రమే అందజేయాలి. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. ఏపీకే ఫైల్స్‌, తెలియని లింకులను ఓపెన్‌ చేయవద్దు.

– హసీబుల్లా, డీఎస్పీ, సైబర్‌క్రైమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement