బిల్లుల ‘పంచాయతీ’ | - | Sakshi
Sakshi News home page

బిల్లుల ‘పంచాయతీ’

Sep 7 2025 7:33 AM | Updated on Sep 7 2025 7:33 AM

బిల్లుల ‘పంచాయతీ’

బిల్లుల ‘పంచాయతీ’

● కార్యదర్శులకు పట్టుకున్న రంది ● పాతచోట చేసిన పనులపై దిగులు ● బదిలీ అయిన వారిలో ఆందోళన ● క్లియరెన్స్‌పై అయోమయం

సాక్షి,ఆదిలాబాద్‌: పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం బిల్లుల రంది పట్టుకుంది. సర్పంచ్‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలన అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. రాష్ట్ర సర్కారు నుంచి కూడా ఎలాంటి నిధులు విడుదల కావడంలేదు. దీంతో పంచాయతీల్లో అత్యవసర పనుల కోసం కార్యదర్శులు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. అయితే ఆ బిల్లులు తర్వాత వస్తాయి అనే నిశ్చింత వారిలో కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. గత జూలైలో జిల్లా వ్యాప్తంగా పలువురు కార్యదర్శులు బదిలీ అయ్యారు. ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఆయా పంచాయతీల్లో వారు వెచ్చించిన డబ్బులకు సంబంధించి బిల్లులు సమర్పించారు. అయితే ఇప్పుడు వారిని ఓ సమస్య వెంటాడుతుంది. ఆ బిల్లులు పంచాయతీ పేరిట వస్తాయి. ఒకవేళ కొత్త పాలకవర్గాలు ఏర్పడితే, ఈ బిల్లులకు ఆ సర్పంచ్‌ అనుకూలంగా వ్యవహరిస్తాడా.. లేని పక్షంలో తమ పరిస్థితి ఏంటి అనే సందిగ్ధం వారిని వెంటాడుతుంది.

పాత సర్పంచ్‌లవే పెండింగ్‌లో..

గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన వారికి సంబంధించి పంచాయతీల్లో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంతే కాకుండా ప్రత్యేకాధికారుల పాలన ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యదర్శులు తమ జేబు నుంచి ఖర్చు చేసిన అనేక వ్యయాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్‌ బిల్లులు వంటివి ప్రతి రోజు ఏదో విధంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, ఇటు పను ల విషయంలో ప్రజలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో కార్యదర్శులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఫిబ్రవరి నుంచి జూలై వరకు ప్రధానంగా వేసవి ఉండటంతో కార్యదర్శులు తాగునీటి పనుల కోసం అధికంగా వెచ్చించారు. చిన్న పంచాయతీల్లో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు అప్పుడున్న సెక్రెటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేశారు. అయితే బదిలీల తర్వాత ఇప్పటి వరకు 14 నెలల్లో చిన్న పంచాయతీల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు , పెద్ద పంచాయతీల్లో రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చించినట్లు కార్యదర్శులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల విషయంలో చర్చ జరుగుతుండటం, ఒక వేళ కొత్త పాలకవర్గాలు ఏర్పడితే తమకు సంబంధించి పాత, కొత్త బిల్లులు ఏ విధంగా చేతికందుతాయోననే రంది వారిని వెంటాడుతుంది.

ఇంద్రవెల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించిన కార్యదర్శి గతేడాది జూలైలో ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని ఓ పంచాయతీకి బదిలీ అయ్యాడు. పాత పంచాయతీలో వివిధ పనుల కోసం రూ.లక్ష 30వేలు తన జేబు నుంచి ఖర్చు చేశాడు. ఇప్పటికే ఏడాది దాటింది. బిల్లులు మాత్రం రాలేదు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న చోట కూడా రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పాత బిల్లులు పంచాయతీ పేరిట వస్తుండగా.. ఆ డబ్బులు తన చేతికి అందేదెలా అనే సందిగ్ధం అతడిలో కనిపిస్తోంది. ఇతనొక్కడే కాదు.. బదిలీ అయిన వందలాది మంది కార్యదర్శులదీ ఇదే పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement