
● రిమ్స్‌లో రెగ్యులర్ ప్రొఫెసర్లను కేటాయించిన ప్రభుత్వ
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కొనసాగేనా.. లేక రెగ్యులర్‌గా నియామకమైన ప్రొఫెసర్లతో సేవలు అందించేనా అనే సందేహం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రిమ్స్‌కు తొమ్మిది మంది ప్రొఫె సర్లను నియమించింది. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అవుతున్నాయనే సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రెగ్యులర్ ప్రొఫెసర్లు విధుల్లో చేరితే ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారిని తొలగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రస్తుతం ఒప్పంద పద్ధతిన పనిచేస్తున్న వారు హైకోర్టును ఆశ్రయించారు. తాము సెమీ అటానమస్ ఆస్పత్రిలో పనిచేస్తున్నామని, 21 చట్టం ప్రకారం ఆస్పత్రి కమిటీ తమను కొనసాగించాలని పేర్కొంటున్నారు. వైద్యులు లేని సమయంలో ఇక్కడ సేవలు అందించా మని, ఎన్‌ఎంసీ తనిఖీకి వచ్చిన సమయంలో తామే దిక్కుగా ఉన్నామని, ఇప్పుడు తమను తొలగించడం ఎంతవరకు సబబని అంటున్నారు. అయితే కొంత మంది రెగ్యులర్ వైద్యులు తాము 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నా ఇప్పటివరకు పదోన్నతి లభించలేదని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రమోషన్ కల్పిస్తే అడ్డుకోవడం సరికాదని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కొన్నేళ్లలోనే ఆ స్థాయిని పొందారని పేర్కొంటున్నారు. అయితే కోర్టు తీర్పుతో ఎవరు కొనసాగుతారనేది స్పష్టం కానుంది.
కోర్టును ఆశ్రయించిన వైనం..
రిమ్స్‌లో 21 విభాగాలకు గాను 13 విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం తొమ్మిది విభాగాల్లో ప్రొఫెసర్లను నియమించింది. అయితే వీటిలో ఎంత మంది విధుల్లో చేరుతారు.. ఎంత మంది చేరరనే దానిపై స్పష్టత లేదు. రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించడంతో కాంట్రాక్ట్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రస్తుతం స్టే విధించగా, తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పదోన్నతి పొందిన ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది.
రెగ్యులర్ పోస్టుల కేటాయింపు..
రాష్ట్ర వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతిపై భర్తీ చేసిన ప్రభుత్వం రిమ్స్‌లో తొమ్మిది రెగ్యులర్ పోస్టులను కేటాయించింది. వీటిలో ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, అనస్తీషియా, గైనిక్, రేడియాలజీ, పాథాలజీ విభాగాల్లో ప్రొఫెసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అందుబాటులో ఉండేనా..
ప్రభుత్వం రిమ్స్‌కు కేటాయించిన రెగ్యులర్ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులు పనిచేస్తున్నారు. అయితే రెగ్యులర్ వైద్యులు చేరిన తర్వాత అందుబాటులో ఉండకపోతే రోగుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది ఇక్కడ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది డిప్యూటేషన్, సెలవుల్లో వెళితే రోగులకు వైద్యసేవలు అందకుండాపోతాయని, భవిష్యత్తులో అసోసియేట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తే తమ పోస్టులు కూడా లేకుండా పోతాయని కాంట్రాక్ట్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా రిమ్స్‌లో సేవలు అందిస్తున్నామని, సెమీఅటానమస్‌గా ఉన్న రిమ్స్‌లో పోస్టులను భర్తీ చేసే విషయం, లేక ఉన్నవారినే కొనసాగించేది రిమ్స్ కమిటీ చేతిలో ఉంటుందని చెబుతున్నారు. కోర్టు తీర్పు వెలువడేంత వరకు ప్రస్తుతం ఉన్న వైద్యులతోనే సేవలు కొనసాగించనున్నారు.
కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కోర్టుకెళ్లారు..
కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించింది. ఇప్పటివరకు రెగ్యులర్ ప్రొఫెసర్లు విధుల్లో చేరలేదు.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్

● రిమ్స్‌లో రెగ్యులర్ ప్రొఫెసర్లను కేటాయించిన ప్రభుత్వ