
‘49’ తెచ్చింది.. అప్పటి ప్రభుత్వాలే!
● కాంగ్రెస్‌కు సంబంధం లేదు.. ● జీవో రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం ● మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్‌రూరల్: జీవో 49కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ జీవోను 2016లో రాష్ట్రంలోని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముసాయిదా తీసుకువచ్చిందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆసిఫాబాద్ ప్రాంతంలో కారిడర్ పేరిట లక్షలాది ఆదివాసీలను నిర్వాసితులు చేసే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేసే జీవో 49 రద్దు చేయాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, జూపల్లిని కలిసి విన్నవించామన్నారు. స్పందించిన వారు ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేశారన్నారు. అయితే గతంలో ఆ జీవోకు మద్దతు ఇచ్చిన అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఎంపీ గోడం నగేశ్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆ జీవో రద్దు చేసేంత వరకు ఢిల్లీస్థాయి వరకు ఉద్యమిస్తామన్నారు. తుడుందెబ్బలోని కొంతమంది నాయకులు డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు రావడంతో అందులో నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నానని తెలిపారు. ఆదివాసీ సమస్యలపై పోరాటం చేసేందుకు రాజ్‌గోండ్ సేవా సమితిలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా నెల 27న ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంఘం నాయకులు సిడాం అర్జు, ఆత్రం పరుశురాం, హన్ను పటేల్, శంబు, తానాజీ, ఆనంద్‌రావ్, శ్యాంరావ్, తదితరులున్నారు.