
‘ఫేస్’తోనే ఇక పింఛన్
● ముఖ గుర్తింపు అమలుకు ప్రభుత్వం కసరత్తు ● నేడు బీపీఎంలకు శిక్షణ ● ఆగస్టు నుంచి అమల్లోకి.. ● అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు
కైలాస్‌నగర్: చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం అమలుపై సెర్ప్ పెన్షన్ విభాగం డీపీఎం, ఏపీఎంలకు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గ్రామాల వారీగా పంపిణీ చేసే పోస్టల్ శాఖకు సంబంధించిన బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(బీపీఎం)లకు శనివారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది.
అక్రమాలకు చెక్
మున్సిపాలిటీల్లో పింఛన్‌ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్‌లైతే సదరు లబ్ధిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది. కానీ అలా జరగడం లేదు. పింఛన్‌దారులు మరణించినా డబ్బులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అలాగే పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు మరణించిన లబ్ధిదా రుల పింఛన్ కాజేసిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇబ్బందులు దూరం ..
ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారుల్లో అత్యధికులు వృద్ధులు, దివ్యాంగులే. వీరిలో 60 నుంచి 80 ఏళ్లు దాటిన వారి చేతి వేళ్ల కొనలు అరిగిపోయి వేలిముద్రలు పడటం లేదు. దీంతో పింఛన్ల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రల ఆధారంగా పింఛన్లు అందజేస్తున్నప్పటికీ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను దూరం చేసేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను తీసుకొచ్చింది. ఆధార్‌కు ఫొటో అనుసంధానమైన లబ్ధిదారులను స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీయగానే వారి వివరాలు ప్రత్యక్షమై పేమేంట్ మోడల్‌లోకి వెలుతుంది. దీంతో సత్వరం నగదు పొందే అవకాశముంది. ఈ యాప్‌తో కూడిన అధునాతన స్మార్ట్‌ఫోన్లను జిల్లాలోని 250 మంది బీపీఎంలకు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు శనివారం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ పరిస్థితి ..
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బీడీ వర్కర్లతో పాటు హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు (1,012), ఫైలేరియా బాధితులు (645) డయాలిసిస్ రోగులు (78)లు చేయూత పథకం కింద పింఛన్ పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి 75,564 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.19 కోట్ల 51లక్షల 27వేల 790లను చెల్లిస్తోంది. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016లను అందజేస్తోంది.