
దంచి కొట్టలే..
జిల్లాకు ‘రెడ్.. ఆరంజ్ అలర్ట్’ అంటూ ఇటీవల వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి మా త్రం భిన్నంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా గడిచిన ఐదు రోజులుగా నమోదైన వర్షపాత వివరాలే ఇందుకు నిదర్శనం. ఈ నెల 25న 10 మి.మీ.లు నమోదు కాగా 24న 26.8 మి.మీ.లు, 23న 2.0 మి.మీ.లు, 22న 7.4 మి.మీ. లు, 21న 0.0 మి.మీ. సగటు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఈలెక్కలను పరిశీలిస్తే ఓ మోస్తారు వర్షాలే అని చెప్పవచ్చు.
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్నిచోట్ల జలాశయాలు నిండుకుండల్లా తయారయ్యాయి. అయితే జిల్లాలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా జిల్లాకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ అంటూ వాతావరణ శాఖ నుంచి కూడా సూచనలు జారీ అయ్యాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని అంతా భావించారు. ఒకవేళ వరదలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగం కూడా సిద్ధమైంది. కంట్రోల్‌రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు దంచికొట్టిన వానలే లేవు. నాలుగైదు రోజులుగా ఓ మోస్తారు వర్షాలే కురుస్తున్నాయి. అయితే వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఎప్పుడైనా జోరవాన కురిసే అవకాశం ఉందని జనం భావిస్తున్నారు.
పూర్తిస్థాయిలో నిండని ప్రాజెక్టులు..
జిల్లాలో రెండు మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సాత్నాల ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేదు. మత్తడివాగు ప్రాజెక్ట్‌దీ ఇదే పరిస్థితి. ఇక జిల్లాలో 392 చెరువులు ఉన్నాయి. వాటిలో అధిక శాతం 75 శాతానికి పైగా నిండాయి. అయితే ఎక్కడ కూడా అలుగుపారుతున్న చెరువుల దృశ్యాలు ఇప్పటివరకు లేవు. జూన్ 1 నుంచి వర్షాకాలం మొదలు కాగా, ఆ మాసంలో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో భారీ వర్షాలు కురుస్తాయని ఆశించినప్పటికీ ఈనెల చివరి వరకు వచ్చినప్పటికీ మోస్తరుగానే నమోదయ్యాయి. జిల్లాలో వర్షాపాతం సాధారణంగా ఉన్నప్పటికీ భారీ వర్షాలు అంతగా లేకపోవడం లోటుగా కనిపిస్తుంది.
పంటలకు ఆశాజనకమే..
మోస్తరుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో పంటలకు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయన్న అభిప్రాయం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి, సోయా, కంది, ఇతరత్రా పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అధికంగా వర్షాధారంగానే పండిస్తారు. జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కావడం, జూలైలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మోస్తరు వానలే!
ఈ సీజన్‌లో పరిస్థితి ‘సాధారణ’మే
పంటలకు పర్వాలేదంటున్న రైతాంగం
వర్షపాతం వివరాలు (జూన్ 1 నుంచి జూలై 25 వరకు)
సాధారణం 467 మి.మీ.లు
కురిసింది 447.4 మి.మీ.లు
వ్యత్యాసం – 4 శాతం
స్థితి సాధారణం