
మళ్లీ ఓటర్ల జాబితా
● కుటుంబం ఓట్లన్నీ ఒకేచోట ఉండేలా.. ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● కసరత్తు చేస్తున్న కార్యదర్శులు
కై లాస్‌నగర్: పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రక్రి య వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో మళ్లీ ఓటర్ల జాబితా రూపకల్పనకు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల జాబితా అనుసరించి కుటుంబంలోని సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని సూచించింది. బధవారం నాటికి మెర్జింగ్ స్టేట్‌మెంట్ సిద్ధం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఆ దిశగా దృష్టి సారించిన పంచాయతీ కార్యదర్శులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు.
కుటుంబ సభ్యులంతా ఒకే చోట..
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా అనుసరించి మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు అవసరమైన ఓటర్ల మ్యాపింగ్ చేపట్టనున్నారు. 700 నుంచి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అంతకు మించి ఉంటే అదనంగా మరో కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అలాగే ఒక వార్డులోని ఓటర్లంతా అదే వార్డు పరి ధిలో ఉండేలా చూడటంతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉండేలా ఓటర్ల జాబితా రూపకల్పన చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓటర్ల జాబితాలు పరిశీలిస్తే ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు సీరియల్ నంబర్లను కలిగి ఉంటారు. అలాగే పోలింగ్ స్టేషన్లు సై తం వేర్వేరుగా ఉంటాయి. స్థానిక పోరుకు మాత్రం ఇలాంటి సమస్య తలెత్తకుండా కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలను సిద్ధం చేయనున్నారు.
కసరత్తు చేస్తున్న పంచాయతీ సిబ్బంది
జిల్లాలో గ్రామీణ ఓటర్లను పరిశీలిస్తే పురుషులు 2,20,620 మంది, మహిళలు 2,31,070 మంది ఉన్నారు. ఇతరులు మరో 17 మంది ఉన్నారు. వీరికి సంబంఽధించి ఇది వరకే పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే కొత్తగా నమోదైన ఓటర్లకు సైతం స్థానిక పోరులో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్లీ జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. వార్డుల వారీగా మెర్జింగ్ స్టేట్‌మెంట్‌ను బుధవారం వరకు పూర్తి చేయనున్నారు. ఇది వరకు ఎంపీడీవోల లాగిన్లలో ఓటర్ల మ్యాపింగ్ చేపట్టగా తాజాగా పంచాయతీ కార్యదర్శులకు సైతం ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కుటుంబాల్లోని సభ్యులంతా ఒకే చోట ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ జాబితా ల ఆధారంగానే ప్రభుత్వం స్థానిక సమరానికి వెళ్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంతో ఇటీవల కొత్తగా ఓటు హక్కు పొందిన వారు దాన్ని వినియోగించుకునే వెసులుబాటు కలుగనుంది.
జిల్లాలో..
గ్రామ పంచాయతీలు : 473
వార్డు సభ్యుల స్థానాలు : 3,870
జెడ్పీటీసీ స్థానాలు : 20
ఎంపీపీ స్థానాలు : 20
ఎంపీటీసీ స్థానాలు : 166
పోలింగ్ కేంద్రాలు : 3,888
గ్రామీణ ఓటర్లు : 4,51,707
ఆదేశాలు వచ్చాయి
పంచాయతీ ఓటర్ల జాబితాలు కొత్తగా తయారీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వార్డుల వారీగా సిద్ధం చేయాలని సూచించింది. తదనుగుణంగా చర్యలు చేపట్టాం. పంచాయతీ కార్యదర్శులు అదే పనిలో నిమగ్నమయ్యారు. వార్డులోని ఓటర్లంతా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా శ్రద్ధ వహిస్తున్నాం.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి