
వన మహోత్సవం జయప్రదం చేయాలి
● కలెక్టర్ రాజర్షి షా
అటవీ అధికారులకు ఆయుధాలివ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: సిరిచెల్మ రేంజ్ పరిధి ఇచ్చోడ మండలంలోని కేశవ్‌పట్నంలో పోలీసు, అటవీశాఖ అధికారులపై ముల్తానీల దాడిని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఖండించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మంగళవారం వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అటవీశాఖ అధికారుల ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కలప స్మగ్లర్లు, ముల్తానీ తెగలకు చెందిన వారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలని కోరారు. ఇందులో ఆ సంఘం నాయకులు నరేశ్, ప్రశాంత్, అమర్‌సింగ్, కృష్ణ, సృజన్, శ్యామ్ తదితరులున్నారు.
కై లాస్‌నగర్: వన మహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు ఆయ న పలు సూచనలు చేశారు. ఆయా శాఖలు లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు రవాణా చార్జీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇసుక రవాణా విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యంపై బుధవారం బస్టాండ్‌లో వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ అమలుపై సమీక్ష
ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల వైద్యులు, వైద్యఆరోగ్యశాఖ అధి కారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించా రు. వైద్యసేవల అమలులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈజేహెచ్‌ఎస్ ద్వారా ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్–కేర్‌లో మెరుగైన సేవలను అందించాలన్నారు. ఇందులో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రిమ్స్‌డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసి న 18004251939 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించా లని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల కింద పిడుగుపడే అవకాశముంటుందని తెలిపారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు.