
అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారుద్దీన్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సార్పీ–1 గనిలో కోల్‌ఫిల్లర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డుకు చెందిన బైరి రమేశ్ (36) తన స్నేహితుల వద్ద రూ.5 వడ్డీచొప్పున సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రతీనెల వడ్డీ మాత్రమే కడుతున్నాడు. అసలు ఎలా చెల్లించాలో తెలియక మనస్తాపానికి గురై ఈనెల 17న గడ్డిమందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు, విరేచనాలు చేసుకుని కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య శ్వేత, కుమారుడు ఉన్నారు. శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరు..
ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు శంకర్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన ఆడ విశ్వేశ్వర్‌రా వ్ (48) నాలుగేళ్లుగా మా నసిక స్థితి కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. శనివారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సీతాబాయి, కుమారులు యశ్వంత్‌రావ్, రాజేశ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఈశ్వర్‌నగర్ గ్రామానికి చెందిన అందుసింగ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అందించడంతో కారును అదుపులో తీసుకుని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రగాయాలైన అందుసింగ్‌ను స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్సై రమేశ్‌ను సంప్రదించగా ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య